ప్రజాప్రతినిధులు తమ స్థానానికి న్యాయం చేస్తున్నదీ లేనిదీ ఆత్మావలోకనం చేసుకోవాలనీ, గత లోక్సభలో చివరి రెండు సంవత్సరాలు చర్చలే జరగలేదని మోదీ అంటున్నారు. పార్లమెంటులో ప్రవేశించిన తరువాత (అధికార) పక్షం, విపక్షం భేదాలు విడిచి, ప్రజాసమస్యలపట్ల నిష్పక్షంగా వ్యవహరించాలన్న మాట మరీ బాగుంది. పైగా, విపక్షాలు తమ సంఖ్యాబలం గురించి ఏమాత్రం ఆందోళన చెందనక్కరలేదనీ, వారి ప్రతీమాటకూ విలువ ఇస్తామనీ, లేవనెత్తిన ప్రతీ అంశాన్నీ చర్చిస్తామని ఆయన హామీ ఇస్తున్నారు.

ఈనెల 19న పార్లమెంటులో సభ్యత్వం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులతో మోదీ భేటీ కావడం, ఆ మర్నాడు సభ్యులకు ఓ పెద్ద హోటల్లో విందు ఏర్పాటు చేయడం వంటివి సమష్టితత్వాన్ని పెంపొందించడానికేనని ప్రభుత్వం చెబుతున్నది. మోదీ కలల ప్రాజెక్టు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను మరింత బలంగా ముందుకు నెట్టేపని కూడా ఈ సందర్భంగా జరుగుతుంది. మోదీ మాటలు కాంగ్రెస్కు కూడా నచ్చాయి.

అఖిలపక్ష సమావేశం అద్భుతంగా జరిగిందనీ, అందరూ సహకరిస్తామని హామీ ఇచ్చారని మోదీ సంతోషంగా ట్వీట్ చేశారు. ఈ సమా వేశంలో విపక్షాలు లేవనెత్తిన అంశాలను ఆయన వినడానికి మాత్రమే పరిమితం చేసినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం, నిరుద్యోగం, రైతు సమస్యలు, దేశవ్యాప్త కరువు, పత్రికాస్వేచ్ఛ, జమ్మూకశ్మీర్లో సత్వర ఎన్నికలు ఇత్యాదివి విపక్షాలు ప్రస్తావించాయి.

పార్టీ అధ్యక్ష పదవి మీద విముఖత పెంచుకున్న రాహుల్ ఇంకా నిర్వేదంలోనే ఉన్నట్టున్నారు. ఉభయసభల్లోనూ తమ పక్ష నేతలను ప్రకటించడంలో ఆయన ప్రదర్శిస్తున్న అలసత్వం ఆ పార్టీని మరింత అప్రదిష్ట పాల్జేసింది. గడువు ముగిసేలోగా ఆ స్థానాల భర్తీ జరిగిపోతుంది కానీ, ఇప్పటికే ఎంపికలు జరిగివుంటే, పార్లమెంటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాల మధ్య కాస్త సమన్వయానికి వీలు ఉండేది.


మరింత సమాచారం తెలుసుకోండి: