తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎట్ట‌కేల‌కు త‌న క‌ల నెర‌వేర్చుకుంటున్నారు. తెలంగాణకు కొత్త అసెంబ్లీ, స‌చివాల‌య‌ నిర్మాణానికి ఎప్ప‌ట్నుంచో స‌న్నాహాలు మొద‌లుపెట్టిన కేసీఆర్‌....ఇప్పుడు దానికి ముహుర్తం సైతం సిద్ధం చేసేశారు. శాసనసభకు కొత్త భవనాన్ని నిర్మించాలని మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఎర్రమంజిల్‌లోని ఎత్తయిన ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న స్థలంలోనే సచివాలయం కొత్త భవనాన్ని కూడా నిర్మిస్తారు. ఈ రెండు భవనాలకు ఈ నెల 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. పార్లమెంట్ భవనాన్ని పోలినవిధంగా అసెంబ్లీ నిర్మాణం ఉండాలని మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఈ భవనంలో సెంట్రల్ హాల్, కౌన్సిల్ హాల్, అసెంబ్లీ హాల్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుత శాసనసభ భవనాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించాలని నిర్ణయించారు. 


మంత్రిమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ``ఏపీలో ప్రభుత్వం మారడం మూలాన సెక్రటేరియట్, శాసనసభ భవనాల అప్పగింత పూర్తయింది. రేపు (బుధవారం)అధికారికంగా అప్పగిస్తారు. ఈ రెండు భవనాలు ఖాళీ అయిన దరిమిలా కచ్చితంగా తెలంగాణకు సెక్రటేరియట్ భవనాన్ని, అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయానికొచ్చాం. గతంలో ఏపీ మొండికేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించాం. అందుకే, బైసన్‌పోలో గ్రౌండ్ కావాలని కేంద్రాన్ని అడిగాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడంతో ఇక్కడే సెక్రటేరియట్ నిర్మించాలని నిర్ణయించాం. 5 నుంచి 6 లక్షల ఎస్‌ఎఫ్‌టీ కడితే సరిపోతుందనే నిర్ణయానికొచ్చాం. ధరను పరిశీలిస్తే.. మంచి వరల్డ్ క్లాస్ ఫర్నిచర్‌తో కట్టుకున్నా.. అత్యంత మోడ్రన్‌గా కట్టుకుంటే కూడా.. రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటున్నాం. అసెంబ్లీ భవనం కూడా వంద కోట్లలో కట్టొచ్చని నిర్ణయించాం. పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్, అసెంబ్లీ హాల్, కౌన్సిల్‌హాల్ వంటివి ఇందులో ఉంటాయి. పార్లమెంట్ తరహాలోనే వసతులుంటాయి. సెపరేట్ హాల్స్ నిర్మిస్తాం. ఎర్రమంజిల్‌లో ఎలివేటెడ్ తరహాలో ఉన్న 17ఎకరాల భవనంలో కొత్త అసెంబ్లీ కడతాం. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ బిల్డింగ్‌లా ఉంటుంది. దాన్ని కాపాడే ప్రయత్నంచేస్తాం. ప్రస్తుతమున్న అసెంబ్లీ ఫ్రంట్ ఎలివేషన్ తరహాలోనే కొత్త అసెంబ్లీ భవనం ఎలివేషన్ ఉంటుంది`` అని కేసీఆర్ వెల్ల‌డించారు. 


సెక్రటేరియట్‌లో కొన్ని 50, 60 సంవ‌త్స‌రాల క్రితం కట్టిన బిల్డింగులున్నాయని, ఆ తర్వాత కట్టినవీ ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. ``సెక్ర‌టేరియ‌ట్‌ మొత్తం కూల్చి కట్టాలా? లేక కొన్ని అలాగే ఉంచి వాడుకోవాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తాం. మనం సెక్రటేరియట్ కడుతున్నామని తెలుసుకొని దేశవ్యాప్తంగా ఆర్కిటెక్టులు డిజైన్లు పంపిస్తున్నారు. వాటిలో ఒకటి ఇదిగో ఇలా ఒక తమిళ ఆర్కిటెక్ట్ పంపించారు (అని ఎలివేషన్ చూపించారు). బిల్డింగ్ ఆల్‌మోస్ట్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది? ఒకటే భవనం అటూఇటూగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ముందంతా ఖాళీగా ఉంటుంది. అతిపెద్ద లాన్లు, అద్భుతమైన ఫౌంటెయిన్లు ఉంటాయి. హఫీజ్ కాంట్రాక్టర్ కూడా మంచి డిజైన్ పంపించాడు.ఇవే రెండు, మూడున్నాయి. భూమి పూజ మాత్రం ఈ 27 నాడు చేస్తం. ఆ తర్వాత దసరా రోజు వరకూ మంచి రోజుల్లేవు. పూజ చేసుకుంటే ఏ టైమ్‌లో అంటే ఆ టైమ్‌లో తీసుకోవచ్చు. ఈలోపు ఆర్‌అండ్‌బీ మంత్రి అధ్యక్షతన, ముగ్గురు సభ్యులతో కలిపి ఒక ఉపసంఘం వేస్తాం. మొత్తం కూలగొట్టి కట్టాలా? లేక కొన్ని ఉంచుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని కట్టాలా? అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. దీనివల్ల పని కూడా ఫాస్ట్‌గా జరుగుతుంది. మొత్తం సెక్రటేరియట్‌ను తరలించాలా? లేక పాక్షికంగానా? అనేది క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడుతుంది`` అని సీఎం కేసీఆర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: