రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య శాసనసభలో మాటల యుద్ధం చోటు చేసుకొంది. అధికారంలో ఉన్నప్పుడు బాబు తగిన రీతిలో వ్యవహరించి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బాబు నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలని, ఇప్పటికైనా మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో తెదేపాకి 13 సీట్లు కూడా రావని అన్నారు.

 

ఇంకా.. "చంద్రబాబుని సూటిగా అడుగుతున్నా. గుండెల మీద చేయి వేసుకొని ఆయన చెప్పాలి. 2014 మార్చి 2న ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. అమలుకు ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. 2015 జనవరిలో నీతి ఆయోగ్‌ వచ్చేవరకు ఏడు నెలల్లో ముఖ్యమంత్రి హోదాలో ఒకసారి కూడా ప్రణాళిక సంఘానికి ఆయన (చంద్రబాబు) లేఖ రాయలేదు. కనీసం అడిగే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు?" అన్నారు.

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉద్యోగాలు వచ్చేవి’ అని జగన్‌ మండిపడ్డారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే తప్ప ప్రమాణ స్వీకారం చేయనని హెచ్చరించడంతో కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చేసిందని చెబుతున్న చంద్రబాబు... ప్రత్యేక హోదాపై ఎందుకు కేంద్రాన్ని అడగలేదని ప్రశ్నించారు.

 

శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అనేకసార్లు దిల్లీ వెళ్లామని చెబుతున్నా ఆయనేం సాధించారని ప్రశ్నించారు. వెళ్లినప్పుడల్లా అరుణ్‌జైట్లీ వంటి అప్పటి కేంద్ర మంత్రులను శాలువలతో సత్కరించి, వీణలు అందించడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: