గురుకులాల‌ను పూర్తి స్థాయిలో మార్చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంటున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇందులో భాగంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముందెన్న‌డూ లేని సంచ‌ల‌నానికి ప్ర‌భుత్వం ఓకే చెప్పేసింది.  రాష్ర్టంలోని ఎస్సీ కళాశాల హాస్టళ్లలో ఉండి చదువుకొనే విద్యార్థుల వ్యక్తిగత ఖర్చులకోసం ప్రతినెలా పాకెట్ మనీ కింద రూ.500 అందించనున్నట్టు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వచ్చేనెల నుంచి దీనిని అమలుచేయనున్నట్టు ప్రకటించారు. పోస్ట్‌మెట్రిక్ చదివే విద్యార్థులుండే హాస్టళ్ల నిర్వహణా వ్యయాన్ని కూడా పెంచుతున్నట్టు తెలిపారు. 


సచివాలయంలో అధికారులతో ప్రీమెట్రిక్ (పదోతరగతి లోపు), పోస్ట్‌మెట్రిక్ (ఇంటర్ ఆపైవిద్యార్థులు) హాస్టళ్ల నిర్వహణ, నిధుల కేటాయింపు, బెస్ట్ అవలబుల్ స్కూళ్లలో విద్యార్థుల చేరిక, ప్రభుత్వపరంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ ప్రక్రియ వంటి అంశాలపై మంత్రి సమీక్షించారు. ఎస్సీ కళాశాల హాస్టళ్ల నిర్వహణ వ్యయం పెంచామని, బాలికలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. జూలై నుంచి విద్యార్థుల వ్యక్తిగత ఖర్చులకోసం అదనంగా రూ.500 ప్రతినెలా పాకెట్ మనీ అందించనున్నట్టు వెల్లడించారు. 


రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తున్న నిధులను ఏటా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి రూ.4 వేలు వెచ్చిస్తుండగా, 2019-20 విద్యాసంవత్సరానికిగాను రూ.6 వేలకు పెంచుతున్నామని చెప్పారు. హాస్టళ్లకు రక్షణ కోసం సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా పగలు, రాత్రి రెండు షిఫ్ట్‌లలో రూ.10 వేల వేతనానికి పనిచేసేవిధంగా వాచ్‌మన్లను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులు వార్షికోత్సవం నిర్వహించుకునేందుకు వీలుగా రూ. 20 వేలు ఏటా మంజూరుచేయనున్నట్టు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసినట్టు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: