కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా పశ్చిమ బెంగాల్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి నియమితులయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పదవిని చేపట్టడానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించడంతో.. అధీర్‌ను ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మక సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

యూపీఏ ఛైర్‌‌పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో.. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతను ఎన్నుకునే విషయమై చర్చ జరిగింది. రాహుల్‌ నిరాకరించడంతో ఆధిర్‌ను ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ పక్ష నేతగా అధీర్‌ రంజన్‌ చౌధురిని ఎన్నుకున్నట్టు రాసిన లేఖను కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ సెక్రటేరియట్‌కు అందజేశారు.

 

రంజన్, బెంగాల్ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. 1999 నుంచి ఆయన వరుసగా గెలుస్తున్నారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలోని బర్హంపురం లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996 నుంచి 1999 వరకు బెంగాల్ ఎమ్మెల్యేగా పని చేశారు. అప్పటికి వరుసగా రెండుసార్లు లోక్ సభకు పోటీ చేసి ఓడిన ప్రణబ్ ముఖర్జీ, 2004, 2009ల్లో లోక్ సభకు ఎన్నిక కావడంలో చౌధురీది కీలక పాత్ర.

 

కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో కనీసం పది శాతం సీట్లను కూడా పొందలేకపోయింది. దీంతో ప్రతిపక్ష హోదాను ఆ పార్టీ కోల్పోయింది. 2014లోనూ ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను పొందలేకపోయింది. గత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే గత ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: