పిల్లలను బడులకు పంపించే ప్రతి తల్లి చేతిలో 2020 జనవరి 26న రూ.15వేలు పెడతాం... అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో ‘అమ్మ ఒడి’ పథకం రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలకు ప్రధాన ఎజెండాగా మారింది. ఈ పథకం అమలుకు విధివిధానాలు ఇంకా తయారు కానప్పటికీ పలు అభిప్రాయాలు, సందేహాలు, సూచనలు వెల్లువెత్తుతున్నాయి. అవేమిటో తిలకించండి....

 

రాష్ట్రంలో అన్ని రకాల యాజమాన్యాల్లో కలిపి దాదాపు 55వేల పాఠశాలలు ఉండగా... వాటిల్లో సుమారు 69లక్షల మంది పిల్లలు ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. ఇందులో 41వేల ప్రభుత్వ పాఠశాలల్లో 39లక్షల మంది, 14వేల ప్రైవేట్‌ పాఠశాలల్లో 30లక్షల మంది పిల్లలు ఉన్నారు. తొలుత సీఎం చేసిన ప్రకటన ప్రకారం అయితే... మొత్తం 69లక్షల మందికీ పథకం వర్తింపజేయాల్సి ఉంటుంది.

 

కానీ, ఈ పథకం సత్ఫలితాలు, దుష్పరిణాలమాలపై చర్చకు తెరలేచింది. ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలకు వర్తింపజేస్తారు?.. బడికి పంపించడమే ప్రాతిపదికగా ఉంటుందా?.. ఆదాయ పరిమితి ఏమైనా ఉంటుందా?.. ఏ తరగతి వరకూ పథకాన్ని అమలు చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లులకే వర్తింపజేయాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

 

కార్పొరేటు, ప్రైవేటు పాఠశాలల పిల్లల తల్లులకు కూడా వర్తింపజేస్తే ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పేద, బడుగువర్గాల కుటుంబాల పిల్లలే సింహభాగం ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరికి ఫీజులు లేకున్నా, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేస్తున్నా, 9-10 తరగతుల అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లు ఇస్తున్నా ఇంగ్లీషు మీడియంపై తల్లిదండ్రులకు ఇంటరెస్ట్ కలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: