తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మంగా చేపట్టింది. అతి తక్కువ వ్యవధిలో ఈ భారీ సాగు నీటి ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ లు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. కేసీఆర్ నేతృత్వం లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు సకాలం లో పూర్తి చేయడానికి కృషి చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు  హాట్ టాఫిక్ గా మారింది.


కాళేశ్వరం ప్రాజెక్టు ను సకాలం లో  పూర్తి చేయడానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు తీవ్రంగా కృషి చేశారు. రాత్రి అనేక పగలు అనక , ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతను సకాలంలో  పూర్తి చేయాలన్న లక్ష్యం తో హరీష్ చేసిన కృషి వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ముందు  నిర్దేశించుకున్న సమయానికి   పూర్తి కావొచ్చిందన్నది నిర్వివాదాంశం.  అయితే రెండవసారి టీఆరెస్ అధికారం లోకి వచ్చిన తరువాత హరీష్ ను మంత్రివర్గం నుంచి తప్పించిన కేసీఆర్,  ప్రస్తుతం నీటి పారుదల శాఖ తన వద్దే పెట్టుకున్నారు. కాళేశ్వరం పై ఆయనే సమీక్షలు నిర్వహిస్తూ, పనులు పూర్తి చేసేవిధంగా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతాబాగానే ఉన్నా..కాళేశ్వరం ప్రాజెక్టు సకాలం పూర్తి చేయడానికి  కృషి చేసిన హరీష్ కు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదన్న అభిప్రాయం ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదిక గా వారు  విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వమే తమ ఆర్ధిక వనరులను వినియోగించి కాళేశ్వరం ప్రాజెక్టును   పూర్తి చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఎటువంటి సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. అయితే కేంద్రం ఏమి చేసిందో కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి హరీష్ రావును అడగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కేసీఆర్ కు సూచించారు.  అసలు హరీష్ రావు ఎక్కడ అంటూ ప్రశ్నించిన ఆయన అసలు కన్పించడం లేదంటూ ముఖ్యమంత్రి కి చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు ప్రధానిని, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను ఆహ్వానించకపోవడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: