ఒంగోలు: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉండగా- సగం గ్రామాల్లో జాబితా తయారీలో జాప్యం చోటు చేసుకుంది. ముందస్తుగా గత నెల 31నే ముసాయిదా జాబితా ప్రకటించారు.

 

తరువాత గ్రామ కార్యదర్శులు వాటిపై ఫిర్యాదులు స్వీకరించారు. విచారణ అనంతరం వాటి ఆమోదం నిమిత్తం ఈ నెల 11 నుంచి 17వతేదీ వరకు జిల్లాలోని 1038 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు. తుది జాబితాలను మంగళవారం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సగం గ్రామాల్లో జాబితాల తయారీలో జాప్యం చోటు చేసుకుంది.

 

18న జాబితాలు ప్రకటించాల్సి ఉంటే- మొదటి నుంచి వాటి తయారీపై జిల్లా పంచాయతీ అధికారితోపాటు ఇతర డీఎల్‌పీవోల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. జాబితాల పరిశీలన నిమిత్తం కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలకు వచ్చిన స్థానికులు నోటీసు బోర్డుల్లో జాబితాలు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.

 

మిగిలిన గ్రామాల్లో బుధవారం ప్రచురించనున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి రాజశేఖర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా- ఎక్కువ గ్రామాల్లో జాబితాలను ప్రచురించామని, కొన్ని గ్రామాల్లో జరగని మాట వాస్తవమేనన్నారు. రాత్రి 12 గంటల్లోపు జాబితాలను ప్రచురించి... స్థానికుల దగ్గరి నుంచి సంతకాలు తీసుకుంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: