త‌న త‌న‌యుడు, మాజీ మంత్రి కే తారకరామారావును త‌న రాజ‌కీయ వారసుడిగా ప్ర‌తిష్టింప‌చేయ‌డంలో ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి అన్న‌ట్లుగా ఆయా ప్ర‌క్రియ‌ల‌ను ముందుకు తీసుకొని పోతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌...తాజాగా ఇందుకోసం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేటీఆర్‌ను ఢిల్లీ దృష్టిలో ప‌డేలా చేశారు. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కంట్లో ప‌డేందుకు కేటీఆర్‌కు గులాబీ ద‌ళ‌ప‌తి చాన్స్ ఇచ్చారు.  లోక్‌సభతోపాటు రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరుగనున్న సమావేశానికి టీఆర్‌ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హాజరు అయ్యేలా చేయ‌డమే ఇందుకు తార్క‌ణ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 


ప్ర‌ధాన‌మంత్రి అధ్య‌క్ష‌త జ‌రిగిన ఈ స‌మావేశానికి తాను హాజ‌రుకావ‌డం లేద‌ని, త‌న బ‌దులుగా కేటీఆర్ హాజ‌రవుతున్నార‌ని కేసీఆర్ వివ‌రించారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ పనులతో తాను బిజీగా ఉన్నందున ప్రధాని సమావేశానికి టీఆర్‌ఎస్ తరఫున కేటీఆర్ హాజరవుతున్నట్టు కేసీఆర్ వివ‌రించారు. ఇదిలాఉండ‌గా, ఢిల్లీలో మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న స‌మావేశానికి ప‌లువురు సీఎంలు హాజ‌ర‌య్యారు. మ‌మ‌తా బెన‌ర్జీ, మాయావ‌తి, అఖిలేశ్ యాద‌వ్‌లు స‌మావేశానికి డుమ్మా కొట్టారు. ఈ స‌మావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, ఏఐడీఎంకే, డీఎంకే, జేడీ-ఎస్, టీడీపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ భేటీకి హాజరుకావట్లేదని ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్‌ కూడా సమావేశానికి హజరుకాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హజరు కావడంలేదని పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 


కాగా, ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేక‌మ‌ని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లను ఒకేసారి నిర్వ‌హించ‌డం స‌రికాదు అని ఏచూరి తెలిపారు. జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం వ‌ల్ల రాజ్యాంగ స్పూర్తి దెబ్బ‌తింటుంద‌న్నారు. రాజ్యాంగబ‌ద్దంగా ప్ర‌భుత్వ బాధ్య‌త‌ల‌ను విస్మ‌రించిన‌ట్లు అవుతుంద‌న్నారు. ప‌దేప‌దే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల అభివృద్ధి ఆగిపోతుంద‌ని, ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ఉత్త‌మ విధానం అని ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. జ‌మిలి ఎన్నిక‌ల విధానానికి సూత్ర‌ప్రాయ అంగీకారం తెలిపిన‌ట్లు స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: