అవినీతి చేసినవారికి శిక్షలు తప్పవు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మట్టి, ఇసుక, ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు.. చివరకు మరుగుదొడ్లలోనూ అవినీతి జరిగిందని.. లంచం ఇవ్వనిదే ఏ పనీ కాలేదని విమర్శించారు. ఈ వ్యవస్థను మారుస్తామని స్పష్టం చేశారు. రేషన్‌, పెన్షన్‌, పంటల బీమా, ఇంటి స్థలం పత్రం.. ఇలా ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధినీ డోర్‌ డెలివరీ చేస్తామన్నారు.

 

చంద్రబాబు మాట్లాడితే అబద్ధాలు చెబుతారు. తెలంగాణలోని ఏడు ముంపు మండలాలు కలిపితే తప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనని చెప్పానంటారు. సరే! మరి ప్రత్యేక హోదా ఏం పాపం చేసుకుంది? ప్రత్యేక హోదాపై ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది. మీ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పులేదు. మీరిలాగే ఉండండి. ఈసారి 23 వచ్చాయి. వచ్చేసారి 13 కూడా రావు.

 

ఒక్క అవకాశం ఇవ్వండి.. చెడిపోయిన వ్యవస్థను మారుస్తానని హామీ ఇచ్చా. మనస్ఫూర్తిగా ఆ పనిచేస్తా. మాది దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రభుత్వం. పారదర్శకత ఎలా ఉంటుందో దేశానికే కాదు.. ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా చూపిస్తాం. అవినీతి ఎవరు చేసినా కచ్చితంగా సహించం. పారదర్శక పాలన కోసం జ్యుడీషియల్‌ కమిషన్‌ వేస్తున్నామని చెప్పాం. ఒక న్యాయమూర్తిని కూడా అడిగాం. ప్రాజెక్టుల టెండర్లన్నీ ఈ కమిషన్‌ పరిశీలిస్తుంది.

 

రైతు భరోసాను అక్టోబరు 15నుంచే ఇస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పాత రుణాలతో సంబంధం లేకుండా ఏటా రూ.12,500 ఇస్తాం. ఉచితంగా బోర్లు వేయించేందుకు అసెంబ్లీ, ఎంపీ నియోజకవర్గాలకు కలిపి 200 రిగ్గులు కొనాలని ఆదేశించాం. వడ్డీలేని రుణాలందిస్తాం. పంటల బీమా మేమే చెల్లిస్తాం. పరిహారం ఇప్పించే పనీ మేమే చేస్తాం. గ్రామాల్లో 4 లక్షల మంది వాలంటీర్లను నియమిస్తాం.


మరింత సమాచారం తెలుసుకోండి: