ఇదేంటి, టి.వి. ప్రసారాలు మింగేయడమేంటని అనుకుంటున్నారా! ఒకసారి కధలోకెళితే స్టోరీ మీకే అర్ధమౌతుంది. బలవంతపు వసూళ్లు, కబ్జాల కేసులతో పీకల్లోతు వివాదాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనకుడు శివరామ్‌ వ్యవహారంలో మరో బండారం బట్టబయలైంది. స్టార్ టీవీ ప్రసారాలకు సంబందించిన విషయంలో కేసు నమోదైంది.

 

డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడిన వ్యవహారంలో శివరామ్‌పై కోర్టు ధిక్కరణ అభియోగం నమోదు కానుంది. వివరాల్లోకి వెళితే, కోడెల శివరామ్ నరసరావుపేటలో గౌతం కమ్యూనికేషన్స్ పేరిట కే ఛానెల్ నిర్వహిస్తూ అక్రమ పైరసీకి పాల్పడుతున్నారు. స్టార్ టీవీ ప్రసారాలను పైరసీ చేస్తున్నట్లుగా తేలడంతో స్టార్ టీవీ ప్రతినిధులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అక్కడి పోలీసులు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సభ్యులు  ఏప్రిల్ 18న రాజాగారికోటలోని కే ఛానెల్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు.  అక్కడ ప్రసారాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించి డీకోడర్, ఎన్‌కోడర్‌లను స్వాధీనం చేసుకుని.. న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు.

 

దీనిపై కోర్టు కోడెల శివరామ్‌కు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో కమిషన్ న్యాయవాది లక్ష్యవీర్ మంగళవారం కే ఛానెల్ కార్యాలయానికి వెళ్లి... సమన్లు ఇచ్చే ప్రయత్నం చేయగా సిబ్బంది వాటిని తిరస్కరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద కోర్టుకు నివేదిక అందించనున్నట్లు న్యాయవాది తెలిపారు.  శివరామ్‌ పై చర్యలు తీసుకోవాల్సిందిగా స్టార్ ప్రతినిధులు సీఐని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: