రైతు రాష్ట్రం సర్వనాశనమైందని, 10 రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని.. త్వరలో వివరాలు వెల్లడిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ రాజకీయ కక్షలు ఉండవు కానీ.. అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్షం సహకరించకపోయినా వెనక్కి తగ్గేదిలేదని, రాష్ట్ర అభివృద్ధి వైపు తన అడుగులు వేస్తూనే ఉంటానని జగన్‌ స్పష్టం చేశారు.
 


ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు రూ. వెయ్యి ఉన్న పెన్షన్‌ను రూ.2,250కి పెంచామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుకుంటూ వెళ్తామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణ కంటే రూ. వెయ్యి ఎక్కువగా అంగన్‌వాడీల వేతనాలు పెంచామన్నారు. ఆశా వర్కర్లకు రూ. 10 వేలకు వేతనాలు పెంచామన్నారు. పారిశుధ్య కార్మికులు చేసే పనికి వారి కాళ్లు మొక్కాలని, పారిశుధ్య కార్మికుల జీతాన్ని రూ.18వేలకు పెంచామని జగన్ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు కమిటీ వేసినట్లు సీఎం తెలిపారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రులతో కమిటీ వేశామన్నారు.


 వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని జగన్ ప్రకటించారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. కొత్తగా 650 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తామని, ఉగాది రోజున మహిళల పేరుతో రూ. 25లక్షల ఇళ్లకు పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయాలు ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేస్తామని చెప్పారు.


లబ్దిదారుడు లంచాలు ఇచ్చే పరిస్థితి పోవాలని, ఆగస్టు 15న 4లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం జరుగుతుందని, గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు సీఎంవోలో కాల్‌సెంటర్‌ ఎర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ఇస్తూ జీవో ఇచ్చామని, సీపీఎస్‌ రద్దుపై కమిటీ ఏర్పాటు చేశామని జగన్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: