ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య  ఉన్న స్నేహం క‌లగా కొన్నాళ్ల‌కే మిగిలిపోతుందా?  లేక క‌ల‌కాలం నిలిచిపోతుందా?  ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన అనేకానేక ప్ర‌శ్న‌ల్లో కీల‌క‌మైంది ఇది!  ఈ క్ర‌మంలో తాజాగా టీ-సీఎం కేసీఆర్.. వ్యాఖ్యానించిన‌ట్టు.. ఆంధ్రప్రదేశ్‌తో స్నేహం కలకాలం సాగాలి. విభజన సజావుగా సాగకుండా కొన్ని పార్టీలు చేసిన కుట్రల వల్ల రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయి. అదో పీడకల. జగన్‌ అధికారంలోకి రావడంతో  తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సౌరభాలు విరజిమ్ముతున్నాయి. ఏపీ, తెలంగాణ పరస్పర సహకారంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తాయి. గతంలో ఎన్నడూ చూడని మంచి ఫలితాలను అన్ని రంగాల్లో సాధిస్తాం. అనేది ఏమేర‌కు సాకారం అవుతంద‌నేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.


అయితే, అటు ఏపీతో తెలంగాణ‌తో ఉన్న అవ‌స‌రాల‌కు, తెలంగాణ‌తో ఏపీకి ఉన్న అవ‌స‌రాల‌కు మ‌ధ్య చాలా వైరుధ్యం ఉండ‌డంతో ఏపీ-తెలంగాణ పొత్తు అనేది ఒక ఒర‌లో ఇముడుతుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తెలంగాణ ఏపీకి ఎగువ రాష్ట్రం. పైగా ఈ రాష్ట్రం నుంచే కృష్ణా, గోదావ‌రి న‌దులు ఏపీలోకి ప్ర‌వేశిస్తాయి. దీంతో ఆయా న‌దుల నీటి విష యంలో ఇప్ప‌టికే నెల‌కొన్ని వివాదాలను ప‌రిష్క‌రించ‌డం అనేది రాజ‌కీయంగా పెనువేసుకున్న విష‌యం. ఎక్క‌డైనా బావే కానీ, వంగ‌తోట కాడ మాత్రం కాద‌న్న‌ట్టుగా.. ఎన్నిక‌ల సీజ‌న్ వ‌చ్చే స‌రికి ఏ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా కుటుంబ రాజ‌కీయాలు చేస్తున్నార‌నే తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ‌లో ప్ర‌ధానంగా రెండు రాజ‌కీయ పార్టీలు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయి. 


వీటిలో ప్ర‌ధానంగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఎప్పుడు అవ‌కాశం చిక్కితే.. అప్పుడు అధికారంలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నా యి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌.. త‌న ప్రాజెక్టులకు సంబంధించిన విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డే ప్ర‌శ్న త‌లెత్త‌దు. ఎక్క‌డా రైతుల‌ను ఇబ్బంది పెట్టే ప‌రిస్థితి రాదు. ఏమాత్రం తేడా వ‌చ్చినా అధికారానికే ఎస‌రు వ‌చ్చే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌తో స్నేహాన్నిఆయ‌న అధికారం కోసం ఫ‌ణంగా పెడ‌తార‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌చ్చినా.. విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూళ్లు 9, 10 ల‌లో పేర్కొన్న సంస్థ‌ల ఆస్తుల విభ‌జ‌న‌, విద్యుత్ బ‌కాయిల చెల్లింపు, ఉద్యోగులను తెలంగాణ‌కు పంపించ‌డం వంటివి కీల‌క అంశాలకు ప‌రిష్కారం చూసుకోవ‌డంతో పాటు.. రాయ‌ల‌సీమ‌కు సంబంధించిన నీటి ప్రాజెక్టుల‌ను ప‌రుగులు పెట్టించాలి. దీనికి సంబంధించి తెలంగాణ అభ్యంత‌రం చెప్ప‌డం ఖాయం. 


ఈ నేప‌థ్యంలో ఎంత కావాల‌ను కుని కావ‌లించుకున్నా.. రాజ‌కీయంగా అధికార పీఠాలు నిల‌వాలంటే.. మాత్రం రాజీల‌కు రావాలి! అప్పుడు ఏం జ‌రుగుతుంది? అనేది కీల‌క అంశం. ప్ర‌తి అంగుళాన్నీ స‌స్య శ్యామలం చేస్తామ‌న్న కేసీఆర్ మాట‌లు స‌త్య రూపం దాల్చాలంటే.. ఏపీ వాటా కూడా కీల‌క‌మే! అయితే, ఆయ‌న చెప్పిన‌ట్టు మూడేళ్ల‌లోనే అవి కార్య‌రూపం దాల్చాలంటే.. ఏపీ ద‌గ్గ‌ర అన్ని నిధులు లేనేలేవ‌నేది నిజం. మ‌రి ఈ నేప‌థ్యంలో ఆ క‌ల ఎలా సాకారం అవుతుంది? అనేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అన్ని ప్రాజెక్టులు నేనే క‌డ‌తాను.. మీకు మాత్రం నీళ్లిస్తాను.. అనే దుస్సాహ‌సానికి పూనుకునే రాజ‌కీయ నాయ‌కుడు ఈ దేశంలో ఎవ‌రూ ఉండ‌రు. సో.. ఈ పొత్తు.. క‌ల‌కాలం నిలిచేనా? అనేది ప్ర‌శ్న‌గానే మిగిలింది!!


మరింత సమాచారం తెలుసుకోండి: