రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. టీడీపీ పోయి.. వైసీపీ వ‌చ్చింది. అయితే.. టీడీపీ హ‌యాంలో కొన్ని నామినేటెడ్ ప‌ద‌వుల‌ను అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు త‌న అనుచ‌రులు, పార్టీలో క్రియాశీల స‌భ్యుల‌కు కేటాయించారు. త‌ద్వారా ఎన్నికల్లో టికెట్ల గోల నుంచి త‌ప్పించుకునేందుకు, పార్టీ ప‌రంగా ఎలాంటి అసంతృప్తి లేకుండా చేసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్‌గా క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస ఓట‌మి పాలైన పుట్టా సుధాక‌ర్‌ను నియ‌మించారు. 


గత ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ పాలమండలి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. రెండేళ్ల కాలపరి మితితో అప్పటి టీడీపీ ప్రభుత్వం పుట్టాతోపాటు 16 మంది సభ్యులను పాలకమండలి సభ్యులుగా నియమిం చింది. ఇటీ వల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో టీటీడీ పాలకమండలి రాజీనామా చేసే అనవాయితీ కొనసా గుతోంది. అయితే ప్రభుత్వమే తనను తొలగిస్తే రాజీనామా చేస్తామని పుట్టా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే 10 మంది పాలకమండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, పుట్టా మాత్రం భీష్మించారు. 


త‌న‌కు సెంటిమెంట్ అడ్డు వ‌స్తోంద‌ని,  ప్ర‌భుత్వం త‌న‌ను నియ‌మించిన త‌ర్వాత తాను దేవ‌దేవుడి స‌న్నిధిలో ప్ర‌మాణం చేశాన‌ని, కాబ‌ట్టి ఇప్పుడు తాను రాజీనామా చేయ‌లేన‌ని గ‌త 15 రోజులుగా ఆయ‌న రికార్డ్ ప్లే చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట త‌న‌కు అధికారం లేక పోయినా.. బోర్డు మీటింగ్ నిర్వ‌హించారు. దీనిలో ఈవీ, జేఈవోలు స‌రిగా స‌హ‌క‌రించ‌లేదు. దీంతో క‌మిటీ మీటింగ్ మ‌ధ్య‌లో ముగిసింది. ఇదిలావుండ‌గానే కొంద‌రు స‌భ్యులు రాజీనామా చేయ‌డం, ముఖ్య‌మైన స‌భ్యులు రాఘ‌వేంద్ర‌రావు వంటి వారు కూడా గౌర‌వంగా త‌ప్పుకోవ‌డంతో పుట్టాలో ఆందోళ‌న మొద‌లైంది. ఇదిలావుంటే, తాజాగా శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఆర్డినెన్స్‌తో టీటీడీ పాలక వర్గాన్ని తొలగిస్తామని ప్రకటించారు. 


ఈ ప‌రిణామం పుట్టాను మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేసింది. గౌర‌వంగా బోర్డు నుంచి త‌ప్పు కొంటేనే మంచిద‌ని, లేకుంటే మెడ‌ప‌ట్టి గెంటేస్తార‌ని అనుచ‌రులు చెప్ప‌డంతో ఆయ‌న చివ‌రికి రాజీనామా చేశారు. ఇక‌, ఈ విష‌యంలో జ‌గ‌న్‌ను కూడా ఆయ‌న కాపాడార‌ని అంటున్నారు అనుచ‌రులు. ఒక‌వేళ పుట్టా రాజీనామా చేయ‌క‌పోయి ఉంటే.. ఆర్డినెన్స్ తెచ్చి మ‌రీ.. బీసీ నాయ‌కుడిని ప‌ద‌వి నుంచి గెంటేశార‌నే టాంటాం ప్ర‌చారం టీడీపీ వాళ్లు చేసేవారు. అలాంటి స‌మ‌స్య రాకుండా త‌న గౌర‌వం ఎట్ట‌కేల‌కు కాపాడుకుని, జ‌గ‌న్‌ను కూడా కాపాడార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: