కేంద్రంతోను, ప‌క్క రాష్ట్రాల‌తోనూ పొత్తుతోనే ముందుకు పోతామ‌ని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌క్క‌రాష్ట్రాల మాట అటుంచితే.. కేంద్రంతో మాత్రం ఇటీవ‌ల స‌ఖ్య‌త చూపించలేక పోతున్నారు. వాస్త‌వానికి డిసెంబ‌రులో ఎన్నిక‌లు జ‌రిగిన రాష్ట్రంలో కేసీఆర్ రెండో సారి విజ‌యం సాధించారు. ఈ సంద‌ర్భంగా మోడీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే, దీనికి ప్ర‌తిగా కేసీఆర్ బ‌దులు ఆయ‌న కుమారుడు కేటీఆర్ మాత్ర‌మే స్పందించారు. ఆ త‌ర్వాత కూడా ఢిల్లీ వెళ్లి మోడీని క‌లిసిన దాఖ‌లాలు ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌లేదు. 


ఇక‌, ఈ ఒక్క సంద‌ర్భంలోనే కాకుండా.. కొద్ది రోజుల క్రితం.. జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి కూడా.. కేసీఆర్ హాజరు కాలేదు. మోడీతో తీవ్రమైన రాజకీయ విబేధాలుండటంతో… మమతా బెనర్జీ హాజరు కాలేదు. కానీ.. మోడీతో.. ఎక్కడా పెద్దగా విబేధాలున్నట్లు బయటపడని.. కేసీఆర్ మాత్రం… డుమ్మాకొట్టారు. అంతే కాదు.. కనీసం ప్రతినిధి బృందాన్ని కూడా.. తెలంగాణ తరపు నుంచి పంపకపోవడం చర్చనీయాంశమయింది.  ఎన్నికలు ముగిసినప్పటి నుంచి.. బీజేపీతో… టీఆర్ఎస్ అధినేత దూరం పాటిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలిసిపోతోంది. 


రెండో సారి కూడా కేంద్రంలో విజ‌య ఢంకా మోగించిన‌ మోడీ ప్ర‌ధానిగా చేప‌ట్టిన‌ ప్రమాణస్వీకారానికి కూడా ఆహ్వానం అందినా..  కేసీఆర్  వెళ్లలేదు. దీనికి విమాన ల్యాండింగ్ స‌మ‌స్య కారణ‌మ‌ని తెర‌మీదికి తెచ్చారు. ఇక‌, రాష్ట్రాల‌కు- కేంద్రానికి మ‌ధ్య అత్యంత కీల‌క‌మైన నీతి ఆయోగ్ భేటీకి కూడా కేసీఆర్‌ వెళ్లలేదు. అదేస‌మ‌యంలో ఆయ‌న ఎంతో స్నేహం చేస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్ వెళ్లి.. హోదాపై ప్ర‌సంగించారు. తాజాగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై మోడీ నిర్వ‌హించిన అన్ని పార్టీల సమావేశానికీ కేసీఆర్ గైర్హాజ‌ర‌య్యారు. 


కనీసం.. రెండో సారి గెలిచినందుకు.. మోడీని.. కేసీఆర్ అభినందించలేదు కూడా. దీంతో.. బీజేపీ – టీఆర్ఎస్ మధ్య సంబంధాలు అంత సానుకూలంగా లేవన్న విషయం మాత్రం స్పష్టమవుతోందంటున్నారు. మొహం చెల్లకనే మోడీ ఎదుటకు..కేసీఆర్ వెళ్లడం లేదని.. బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నా… టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. దీంతో.. ఏదో జరిగిందనే.. అభిప్రాయం మాత్రం పెరిగిపోతోంది. అయితే, తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. కాళేశ్వరం లాంటి ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ కు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదని ఆయన ఆవేదన కేబినెట్ భేటీ తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో కనిపించింది. 


మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి గతంలో మోడీని ఆహ్వానించారు. ఆయన వచ్చి.. ప్రారంభం చేసి వెళ్లారు. ఆ తర్వాత అయినా.. ఆ ప్రాజెక్టుకు కొన్ని నిధులు వస్తాయనుకున్నారు. కానీ రాలేదు. నీతి ఆయోగ్ కూడా… కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.కానీ ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఏ మాత్రం సాయం చేయని కేంద్రానికి క్రెడిట్ ఎందుకివ్వాలన్న ఉద్దేశంతో.. మోడీని కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్‌ను టార్గెట్ చేసే ప్ర‌క్రియ కూడా బీజేపీ స్టార్ట్ చేయ‌బోతోంది... కేసీఆర్ మోడీతో స్నేహంగా ఉన్నా లేక‌పోయినా ఇది మాత్రం ఆగ‌దు. దీంతో కేసీఆర్ చూస్తూ ఇక్క‌డ బీజేపీ బ‌లోపేతం అవ్వ‌డానికి ఒప్పుకోరు. ఆయ‌న ప్లాన్లు ఆయ‌న‌కు ఉంటాయి. దీంతో రాజ‌కీయంగా అప్పుడే మోడీ వ‌ర్సెస్ కేసీఆర్ వార్ స్టార్ట్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. మ‌రి ఇది రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: