ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చిన్న వ‌య‌స్సులోనే సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో పాటు ఎన్నో అరుదైన రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంటూ పోతున్నారు. తెలుగు రాజకీయాల్లోనే ఎప్పుడూ లేనట్టుగా నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని అసెంబ్లీలో కేవలం 23 సీట్లకు పరిమితం చేశారు. అలాగే లోక్‌స‌భలో టీడీపీని కేవలం మూడు సీట్లతో సరిపెట్టారు. తెలుగు రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంల‌కు అవకాశం ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తన క్యాబినెట్ లో ఎన్నికల హామీల్లో ఇచ్చిన దాని కంటే మిన్నగా ఏకంగా 60 శాతం మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.


క‌నీసం మంత్రిగా కూడా పని చేయకుండా సీఎం అయినా అటు కేంద్రంలోను... ఇటు పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదాలను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకునే జగన్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి అరుదైన గౌరవం దక్కేలా చేశారు.


తెలంగాణ జీవనాడిగా అందరు చెబుతున్న కాళేశ్వరం మెగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకంలో జగన్ పేరును ఎక్కించారు. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్య అతిధిగా భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం సముచితమైన గౌరవం ఇచ్చింది. శిలాఫలకంపై ముందుగా గవర్నర్ నరసింహన్ పేరు.. తర్వాత సీఎం కేసీఆర్.. ఆ వెంట ముఖ్య అతిథిలుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్‌ పేర్లు ఉన్నాయి. 


కేసీఆర్ స్వ‌యంగా అమ‌రావ‌తి వెళ్లి జ‌గ‌న్‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి రావాల‌ని ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళుతోన్న తీరు ప్ర‌శంస‌నీయ‌మే. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా చీటికిమాటికి తెలంగాణ ప్ర‌భుత్వంతో వివాదాలు పెట్టుకునే వారు. రాజ‌కీయంగా కూడా కేసీఆర్‌, చంద్ర‌బాబు మ‌ధ్య తీవ్ర‌మైన వైరుధ్యం ఉండ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న చిన్న చిన్న స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం కాలేదు. ఇప్పుడు జ‌గ‌న్ అరుదైన ఆహ్వానాలు, రికార్డుల‌తో అంద‌రి మ‌న‌స్సుల‌ను గెలుచుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: