దేశం చూపును త‌న‌వైపున‌కు తిప్పుకొన్న కీల‌క స‌మావేశం ముగిసింది. పార్లమెంటరీ లైబ్రరీ హాలులో జ‌రిగిన‌ అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు త‌మ వాద‌న‌ను వినిపించాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న 24 పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌తిపాద‌న‌కే జైకొట్టారు. 


స‌మావేశం అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమైన ఐదు అంశాలపై ఆయా పార్టీల అభిప్రాయాలు కోరారని వెల్ల‌డించారు. ``జమిలి ఎన్నికలు ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఎన్నికల వేళ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. దీంతో ఎన్నికలు దఫదఫాలుగా జరగడం వల్ల పాలన కుంటుపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిగితే బడ్జెట్ ఏర్పాటుకు వీలుంటుంది. ప్రజలందరూ సరైన ప్రభుత్వ ఫలాలు పొందాలంటే ఎన్నికలు ఒకేసారి జరగాలి. ఒకేసారి ఎన్నికలకు రాజ్యంగ సవరణకు టీఆర్‌ఎస్ సహకరిస్తుంది. నవ భారత నిర్మాణానికి ప్రధాని సూచనలు అడిగారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున మా అభిప్రాయాన్ని ప్రధానికి తెలిపాం. రాష్ర్టాల బలోపేతం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. జాతీయ, రాష్ర్టాల, ఉమ్మడి జాబితాలపై చర్చలు జరపాలని కోరాం. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను రాష్ర్టాలకు బదలాయించాలని కోరాం. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరాం. వెనుకబడిన జిల్లాల జాబితాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కూడా ఉంది. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా అనుసరించాల్సిన పద్దతి ఉండాలని కోరాం` అని తెలిపారు.


ఇదిలాఉండ‌గా, ప్రధాని మోడీ అధ్యక్షతన దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికలపై ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రాజ్ నాథ్‌ సింగ్ మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశానికి 40 పార్టీలను ఆహ్వానించాం, 24 పార్టీలు పాల్గొన్నాయి. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. జమిలి ఎన్నికల విషయంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: