వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి చేరాలనుకుంటున్న మాజీ మంత్రి అఖిలప్రియ కు ఆ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. ఎందుకంటే... భూమా కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న గంగుల  ఫ్యామిలీ కి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టారు. దీనితో వైస్సార్ కాంగ్రెస్ లో చేరాలనుకున్న అఖిలప్రియ కు దాదాపుగా దారులు మూసుకుపోయినట్లేనన్న ప్రచారం  జరుగుతోంది. కాదు ...కూడదని అఖిలప్రియ, ఆమె సోదరుడు వైస్సార్ కాంగ్రెస్ లో చేరితే, వారికి పార్టీ లో పెద్దగా ప్రాధాన్యత ఉండే అవకాశం లేదంటున్నారు.


గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున  విజయం సాధించిన అఖిలప్రియ, టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు చిక్కి  తండ్రి భూమా నాగిరెడ్డి తో కలిసి సైకిల్ ఎక్కారు. భూమా నాగిరెడ్డి మరణాంతరం అఖిలప్రియ కు చంద్రబాబు తన మంత్రివర్గం లో స్థానం కల్పించారు. మంత్రిగా ఉప ఎన్నికల్లో సోదరుడిని గెలిపించుకోగలిగిన అఖిలప్రియ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ కి భవిష్యత్తు లేదని భావిస్తోన్న అఖిలప్రియ తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


అయితే గంగుల ఫ్యామిలీ టీడీపీ లో ఉన్న సమయం లోనే  భూమా కుటుంబం వైస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీ లో చేరింది . టీడీపీ లో భూమా కుటుంబం చేరిన  అనంతరం  అఖిలప్రియ కు మంత్రి పదవి కట్టబెట్టడం తో, ఇక టీడీపీ లో తాము  ఇమడలేమని భావించిన  గంగుల కుటుంబం  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం ద్వారా  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం తో, గంగుల ప్రభాకర్ రెడ్డి కి,  సీఎం  జగన్మోహన్ రెడ్డి  విప్ పదవి కేటాయించారు. దీనితో తిరిగి వైస్సార్ కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న అఖిలప్రియ కు  జగన్మోహన్ రెడ్డి దాదాపు చెక్ చెప్పినట్లేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: