ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలకు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. అమ్మఒడి పథకంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసుకోవాలన్న స్కూళ్ళ యాజమాన్యాల ఆశలపై జగన్ చన్నీళ్ళు చల్లేశారు. తాను ప్రకటించిన అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తింప చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. 

 

 

జగన్ తాజా ప్రకటనతో ప్రైవేటు యాజమాన్యాల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకంటే, తమ స్కూళ్ళల్లో చదివినా పథకం వర్తిస్తుందంటూ చాలా స్కూళ్ళ పిల్లల్ని చేర్చుకుంటున్నాయి. స్కూళ్ళ యాజమాన్యాలు పిఆర్ఓలను పెట్టుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లోని తల్లి దండ్రులకు వలవేసి మరీ పిల్లల్ని చేర్చేసుకుంటున్నాయి.

 

పైగా తమ స్కూల్లో పిల్లల్ని చేర్పిస్తే అమ్మఒడి పథకం వర్తిస్తుందంటూ బోర్డులు కూడా పెట్టేసుకున్నాయి. నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలలను బలోపేతం చేయటమే జగన్ ఉద్దేశ్యం. కానీ జగన్ ప్రకటనను వక్రీకరించిన ప్రైవేటు యాజమాన్యాలు తమ ఇష్టం వచ్చినట్లు వర్తింప చేసుకున్నాయి. దాంతో ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లలో ఆందోళన పెరిగిపోయింది.

 

విషయం తీవ్రతను గుర్తించిన జగన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తేనే వర్తింప చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. దాంతో ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాల డ్రామాలకు తెరపడినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: