అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు అండ్ టీం వేసిన తప్పటడుగు కొన్ని లక్షల ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పడేలా చేశాయని చెప్పవచ్చు. అగ్రిగోల్డ్ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు డిపాజిట్ చేసి మోస పోయాయి. అయితే అప్పుడు బాబు సర్కార్ అమలు కానీ హామీని ఇచ్చి సమస్యని నెత్తి మీదకు తెచ్చుకుంది. డిపాజిటర్ల డబ్బులన్నీ ప్రభుత్వమే తిరిగిస్తుందని చెప్పింది. దీంతో విపక్షాలు ఈ విషయంలో బాబుని టార్గెట్ చేశాయి.

 

బాబు సర్కార్ డబ్బులు చెల్లించలేకపోవడం, విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడంతో.. డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్న డిపాజిటర్లకు బాబు సర్కార్ మీద వ్యతిరేకత మొదలైంది. అసలు డిపాజిటర్లకు డబ్బులు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్న సలహా బాబుకి ఎవరు చెప్పారో కానీ.. ఎంతో అనుభవం ఉన్న బాబు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సలహాను పాటించడం ఆయన చేసిన పెద్ద తప్పు.

 

అగ్రిగోల్డ్ విషయంలో నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకుంటే.. అది ఆ సంస్థ ముక్కు పిండి వసూలు చేసి ఆదుకోవాలి. చట్టం ద్వారా ఆ సంస్థ ఆస్తులు, అప్పులు అంచనా వేసి.. ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు చెల్లించాలి. కానీ ముందుకి ముందే పోయేదేముంది మాటేగా అనుకొని డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. తీరా అది సాధ్యపడక.. విపక్షాల నుంచి విమర్శలు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

 

అంతేకాదు అగ్రిగోల్డ్ ఆస్తులపై అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి అగ్రిగోల్డ్ వ్యవహారం పుణ్యమా అని టీడీపీ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని ఎన్నో లక్షల ఓట్లను దూరం చేసుకుంది. అధికారానికి దూరమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: