తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సుదీర్ఘ భేటీ నిర్వ‌హించారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా దాదాపు గంట‌పాటు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరుకావ‌డంతో పాటుగా అనేక రాజ‌కీయ‌, తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన ప‌లు అంశాల‌పై సైతం చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. తన ప్ర‌భుత్వానికి సంబంధించిన ప‌లు నిర్ణయాలు సైతం గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్లు స‌మాచారం.


కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం గురించి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు వివ‌రించిన సీఎం కేసీఆర్ ఈ ప్రారంభం కోసం మరీ ఆర్భాటంగా కాకుండా పరిమితమైన ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణ యం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. కొత్తగా రూపొందిస్తున్న పురపాలక, రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేర్పులపై జరుగుతున్న కసరత్తు గురించి తెలిపినట్టు సమాచారం. జూలై మూడోవారంలో గానీ, చివరివారంలోగానీ బడ్జెట్ సమావేశాలు జరిపే విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. సచివాలయం కోసం నూతన భవన నిర్మాణం, ఎర్రమంజిల్‌లో నిర్మించనున్న శాసనసభ భవనం ప్రణాళికలు, నమూనాను గవర్నర్‌కు వివరించారు.హైదరాబాద్ ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణపూరిత వాతావరణాన్ని పూర్తిగా తొలగించి స్నేహపూర్వక వైఖరి ద్వారా సుహృద్భావ వాతావరణంలో సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఇందుకు ఏపీ నుంచి లభిస్తున్న సహకారం తదితర విషయాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. దాదాపు గంటన్నరపాటు వీరిరువురి భేటీ జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: