భూమా ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి షాకిచ్చారా ? అవుననే అంటున్నారు వైసిపి నేతలు.  భూమా కుటుంబానికి బద్దశతృవైన గంగుల ప్రభాకర్ రెడ్డిని శాసనమండలిలో విప్ చేయటంలో జగన్ ఉద్దేశ్యం ఇదేనని పార్టీ నేతలంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసిపి నుండి గెలిచిన భూమా కుటుంబం తర్వాత టిడిపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఫిరాయించటమే కాకుండా తండ్రి భూమా నాగిరెడ్డి, కూతురు భూమా అఖిలప్రియ జగన్ ను నానా మాటలన్నారు.  

 

నాగిరెడ్డి మరణించిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. జిల్లాలో మొదటి నుండి భూమా కుటుంబమంటే పడని చాలా కుటుంబాల్లో గంగుల కుటుంబం కూడా ఒకటి. ఎప్పుడైతే భూమా కుటుంబం వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిందో వెంటనే గంగుల కుటుంబం టిడిపిలో నుండి వైసిపిలోకి వచ్చేసింది. దానికితోడు గుంగుల ప్రభాకర్ రెడ్డికి జగన్ బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గంగులకు ఎంఎల్సీ కూడా ఇచ్చారు.

 

మొన్నటి ఎన్నికల్లో భూమా అఖిలను గంగుల కొడుకు గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. దానికి తోడు టిడిపి కూడా ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుండి ఫిరాయింపు మంత్రి వైసిపిలోకి రావటానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

విజయమ్మ ద్వారా వైసిపిలోకి రావటానికి అఖిల ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే  నమ్మకద్రోహం చేసి టిడిపిలోకి ఫిరాయించిన భూమా కుటుంబాన్ని మళ్ళీ వైసిపిలోకి చేర్చుకోవటం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ ఆ విషయం నేరుగా చెప్పకుండా పరోక్షంగా సమాధానం చెప్పారు. గంగులను శాసనమండలి విప్ చేయటం ఇందులో భాగమనే అంటున్నారు పార్టీ నేతలు.

 

ఒకవేళ భూమా కుటుంబం వైసిపిలోకి రావాలంటే గంగుల కుటుంబం ఆధిపత్యాన్ని అంగీకరించాల్సుంటుంది. భూమా కుటుంబం వైసిపిలో చేరాలంటే ముందు గంగుల కుటుంబాన్ని ఒప్పించుకోవాలి. అంటే గంగుల ప్రభాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే భూమా కుటుంబం వైసిపిలోకి వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఫిరాయింపు మంత్రిని జగన్ బాగానే ఇరకాటంలోకి నెట్టేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: