ఎన్నికలు ముగిసిపోయాక,  నేతల ఫిరాయింపులు కామనే. ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ ఎలా కుప్పకూలిందో చూశాం. ఇప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితీ అలాగే అవుతున్నట్లు కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేసినేని నానితోపాటూ... ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలిసింది.

 

ఎలాగూ ఐదేళ్లపాటూ టీడీపీ అధికారంలోకి రాదని భావిస్తున్న ఎంపీలు... అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉండే కంటే... బీజేపీలోకి వెళ్లిపోవడం బెటరని లెక్కలేసుకున్నట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వదిలి వెళ్లిపోతారని తెలిసింది.

 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వాళ్లతో చర్చిస్తున్నారని సమాచారం. ఐదుగురూ వెళ్లిపోతే, ఇక టీడీపీకి రాజ్యసభలో మిగిలింది రవీంద్రకుమార్‌ మాత్రమే అవుతారు. అలా ఐతే టి.డి.పి పరిస్థితేంటని కీలక నేతల అభిప్రాయం.

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై పీకల దాకా కోపంగా ఉన్న ఆ పార్టీ ఎంపీ కేసినేని నానీ... బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలిసింది. అసలు టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం చంద్రబాబే అన్నది ప్రస్తుతం గెలిచిన నేతల్లో మెజార్టీ మాట. నారా లోకేష్‌ను పైకి తేవాలనే ఆలోచనే తప్ప... క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతోందో చంద్రబాబు గ్రహించలేదని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: