తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు రామ్మోహన్ నాయుడును నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ఎలాగూ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబే ఉంటారు కాబట్టి రాష్ట్ర పగ్గాలు మరొకరికి ఇవ్వబోతున్నారు. నిజానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరున్నా ఒకటే. జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబే ఉన్న తర్వాత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఎవరుంటే మాత్రం ఏమిటి ?

 

ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. ఏ విషయంలో అయినా అంతిమ నిర్ణయం చంద్రబాబుదే అన్న విషయం అందరికీ తెలిసిందే. కిమిడి కేవలం పత్రికా ప్రకటనల్లో సంతకాలు పెట్టటానికి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించటానికి  తప్ప ఇంకెందుకు పనికిరాలేదు. జగన్ ను విమర్శించటానికి రాష్ట్ర అధ్యక్ష పదవే అవసరం లేదు కదా ?

 

మంత్రి హోదాలో అంతుకుముందు కూడా సోమిరెడ్డి లాగ నోరుపారేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు పార్టీలో. తమ పార్టీ బిసిలకు పెద్ద పీట వేసిందని చెప్పుకోవటానికి తప్ప మరెందుకు పనికిరాదు చంద్రబాబు ఆలోచన. కమిడి స్ధానంలో ఏ సామాజికవర్గం నేతను పెట్టినా పరిస్ధితిలో అయితే మార్పు రాదు. ఎందుకంటే ప్రతీ విషయంలో అయినా చినబాబు లోకేష్ తర్వాత పెదబాబు చంద్రబాబుదే అంతిమ నిర్ణయం.

 

ఈ విషయం రాష్ట్రంలోని అందరికీ తెలుసు. మరి అలాంటపుడు వేరే ఎవరినో రాష్ట్ర అధ్యక్షునిగా నియమించేబదులు పుత్రరత్నం నారా లోకేష్ నే నియమించవచ్చు. పైగా ఎంఎల్సీ హోదాలో ఇపుడు చాలా ఖాళీ కూడా. అయినా లోకేష్ ను కాదని మరో యువ నేత రామ్మోహన్ నాయుడు వైపే చంద్రబాబు ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు ?

 

ఎందుకంటే అధ్యక్ష బాధ్యతలు లోకేష్ కు అప్పగిస్తే కొంప కొల్లేరే అన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఎందుకంటే, లోకేష్ ఏ విషయంపైన కూడా స్పష్టంగా మాట్లాడలేరు. నిజానికి చంద్రబాబు కొడుకన్న హోదా తప్ప లోకేష్ కు మరో అర్హతేలేదు. ఆ విషయం మూడు సంవత్సరాలపాటు మంత్రిగా ఉన్నపుడే రుజువైపోయింది. పైగా మొన్నటి ఎన్నికల్లో జగన్ దెబ్బకు పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ పరిస్ధితుల్లో లోకేష్ కు బాధ్యతలు అప్పగించటం కన్నా బిసి నేత అయిన రామ్మోహన్ కు అప్పగిస్తేనే మంచిదని చంద్రబాబు అనుకున్నట్లున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: