ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ అధ్యక్షుడు  చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ మెజార్టీ రాజ్యసభ సభ్యులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో టచ్‌లో ఉన్నారు. పార్టీని వీడి వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

 

రాష్ట్రంలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు  సమాచారం. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు  కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. 

 

ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు.  ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

 

 ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్న బీజేపీ.. టీడీపీ ఎంపీలను చేర్చుకోడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.  టీడీపీ రాజ్యసభ సభ్యులు తమతో టచ్‌లోకి రావడంతో వారితో చర్చించే బాధ్యతను రాం మాధవ్, కిషన్‌రెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరితో టీడీపీ ఎంపీల చర్చలు దాదాపు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: