తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు కావడంతో బయట ఏం జరుగుతుందో తెలియనంత దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సైకో ఫాన్సీ అభిమానంతో చంద్రబాబు ఆర్మీ వంటి పేర్లతో ప్రచార పటాటోపం పెరిగిపోయింది. ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాల అమలు, వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోలేనంత భయంకరమైన విష వలయం అధినేతను నిరంతరం తప్పుదారి పట్టించింది.

 

మీడియా పరంగా వ్యతిరేక వార్తలు రాకుండా కొన్నిసంస్థలు జాగ్రత్తలు తీసుకున్నాయి. దీంతో అంతా బాగా ఉందనే భ్రమకు లోనయ్యారు చంద్రబాబు నాయుడు. ఎన్టీయార్, వై.ఎస్ రాజశేఖరరెడ్డిలు అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రులు. అయినప్పటికీ వారెప్పుడూ తమ పేర్లతో స్కీములను ప్రవేశపెట్టుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కోటరీ సలహాలతో వివిధ పథకాలను చంద్రన్న స్కీములుగా మార్చేసుకున్నారు.

 

ఒకవైపు మీడియా, కార్యకర్తలు, సైకో ఫ్యాన్సీ దళాలు టీడీపీ అధినేతను దెబ్బతీశాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం సైతం చంద్రబాబు నాయుడు ను తప్పుదారి పట్టించడమే విచిత్రం. ప్రపంచంలో ఏ ప్రభుత్వంపైనా ఉండనంత సంత్రుప్త స్థాయిని ఆర్టీజీఎస్ వంటి వ్యవస్థల ద్వారా చూపించడం ఒక విచిత్రం. ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై 80శాతం వరకూ సంత్రుప్తి ఉందంటూ తప్పుడు లెక్కలు అందచేశారు.

 

పసుపు కుంకుమ వంటి పథకాలను చివరి దశలోప్రవేశపెట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కేవలం 25 శాతానికే పరిమితమై ఉండేదనేది పరిశీలకుల అంచనా. కులము నష్టపరిస్తే పసుపు కుంకుమ పథకం కనీసం 40 శాతం ఓటు బ్యాంకుతో గౌరవం కాపాడింది. ఆయా కారణాలు తెలిసీ అంగీకరించడానికి మనస్కరించకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికే  నష్టమంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: