నిప్పు లేనిదే పొగ రాదు. కానీ రాజకీయాల్లో నిప్పు లేకుండానే మంటలు పుడతాయి. నీళ్ళలో సైతం మంటలు పుట్టించే సత్తా ఒక్క రాజకీయానికే ఉంది. ఎపుడు ఎలా ఉంటుందో తెలియని పదార్ధం రాజకీయమే. అంతా బాగుందని అనుకుంటున్న వేళ నడి నెత్తిన పిడుగు పడుతుంది. అనూహ్యంగా ఏదో వైపు నుంచి సునామీ వచ్చి ముంచేస్తుంది.


విషయానికి వస్తే టీడీపీలో ఇపుడు పెను సంక్షోభం రగిలే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీని వీడి పోయేందుకు నేతాశ్రీలు రెడీ అవుతున్నారు. పార్టీ భవిష్యత్తు మీద బెంగ ఒక్కసారిగా పెరిగిపోతోంది. చంద్రబాబు కి తాజా ఎన్నికలు చివరి ఇన్నింగ్స్  అని భావించే వారంతా ఇపుడు సర్దుకుంటున్నారు. సైకిల్ దిగిపోవడానికి రెడీ అవుతున్నారు. టీడీపీలో ఉంటే ఇంక మునిగిపోవడం ఖాయమని కూడా భావిస్తున్నారు. .


తాజాగా ఒకే రోజు రెండు ప్రకంపనలు టీడీపీని తాకాయి. ఒకటి ఢిల్లీలో అయితే మరోకటి గల్లీలో. ఢిల్లీలో ఎంపీలు నలుగురు పార్టీని వీడుతున్నారన్న న్యూస్ తెగ వైరల్ అవుతున్న వేళ గల్లీలో అంటే కాకినాడలో కాపు నేతలు భేటీ సెగలు పుట్టిస్తోంది. టీడీపీలో కాపు మాజీ ఎమ్మెల్యేలు ఈ రోజు పెట్టిన మీటింగ్ సైకిల్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 


రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆద్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. వీరు కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. జ్యోతుల నెహ్రూ,బోండా ఉమామహేశ్వరరావు,పంచకర్ల రమేష్ బాబు,ఈలి నాని, వరుపుల రాజా , మీసాల గీత, కె.ఎ. నాయుడు తదితర మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు.  వైసీపీని  ఎదుర్కోవడం కష్టం కనుక బిజెపిలోకి వెళ్లడం బెటర్ అని వీరు భావిస్తున్నారు.


కాగా  బిజెపి అద్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నందున, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఏపిలో బిజెపి ఎదగాలన్నది ఆ పార్టీ నేతల వ్యూహంగా ఉందని చెబుతున్నారు. మరి ఈ కాపులు కమలానికి కాపు కాస్తూ టీడీపీకి సెగ రగిలించడం ఖాయమని అంటున్నారు. ఇపుడు కాపుల వంతు అయితే తొందరలో మరి కొందరు నాయకులు కూడా టీడీపీని వీడుతామని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీని కాపాడేవారెవరో.



మరింత సమాచారం తెలుసుకోండి: