ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఏపీ రాజకీయాల్లో ఎన్నో ప్రకంపనలు వస్తున్నాయి. విపక్ష టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఏకంగా బిజెపిలోకి వెళ్లి పోతున్నారు. మరో రాజ్యసభ సభ్యుడితో పాటు లోక్‌స‌భ‌ ఎంపీ కూడా ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉంటే టిడిపి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు బిజెపి వైపు చూస్తే.... మరికొందరు వైసీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయిన టిడిపికి ఇప్పట్లో రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్ అయిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు.


ఇదిలా ఉంటే తొలి సారి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఘోరాతి ఘోరంగా ఒకే ఒక్క అసెంబ్లీ సీట్ తో సరిపెట్టుకుంది. ఆ పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాదరావు మాత్రమే విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే జనసేన లో రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. వీరిలో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆకుల సత్యనారాయణ ఒకరు.


గతంలో బీజేపీ ఎమ్మెల్యే  ఉన్న ఆయన ఈ ఎన్నికలకు ముందు జనసేనలోకి జంప్ చేసి రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన జనసేన కు గుడ్ బై చెప్పి తిరిగి ఆయన బిజెపి లోకి వెళ్లి పోతున్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా జనసేన కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.


మరోవైపు టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. టీడీపీలోని ప‌లువురు కీల‌క నేత‌లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌న్న విష‌యాన్ని బీజేపీ నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. వారంతా త్వరలోనే బీజేపీలో చేరతారంటూ చెబుతున్నారు. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ నాయ‌క‌త్వంపై ఏపీపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: