'తెలుగు దేశం' ఓటమి ఇప్పుడు  బీజేపీకి వరంలా మారిందా.. అలాగే ఫీల్ అవుతున్నారు బీజేపీ నాయకులు. ఇప్పటికే టీడీపీ నలుగురు ఎంపీలు  బీజేపీలో చేరిపోయారు. ఆ నలుగురు కూడా ఒకప్పుడు టీడీపీకి ప్రధాన ఆర్ధిక వనరులు. వాళ్ళే వెళిపోయాక మిగతా నాయకులు టీడీపీలో ఉంటారా అనేది ఇప్పుడు మిలియన్ల డాలర్ల ప్రశ్న.  ఇలాంటి పరిస్థితుల్లో  టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పుడు మెల్లగా బీజేపీ గూటికి చేరటానికి సిద్ధంగా ఉన్నారట. 


ముఖ్యంగా  అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్ళటానికి  రాయలసీమ నాయకులు  ముందున్నారు. అనంతపురానికి చెందిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం, పల్లె రఘునాధ రెడ్డి, ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, పరిటాల కుటుంబం, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఇ కృష్ణమూర్తి కూడా బీజేపీ తీర్థం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడనే వార్తలు  వస్తున్నాయి. వీళ్ళందరూ కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డితో టచ్ లో ఉన్నారట. మొత్తానికి టీడీపీ నాయకులు బీజేపీలోకి వెళ్ళటానికి జగన్ ప్రభుత్వం  లోపాయికారిగా సహకరిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


వీళ్లంతా టీడీపీని వీడటానికి ఒకే ఒక్క కారణం కనిపిస్తోంది. 23 ఎమ్మెల్యేలకి పడిపోయిన టీడీపీ మళ్ళీ పైకి లేచి, వచ్చే ఐదేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తోందనే  నమ్మకం ప్రస్తుతం ఎవరిలో లేదు. దాంతోనే  బీజేపీలోకి  పోదామని టీడీపీ నాయకులు ఆశ పడుతున్నారు.  మరో వైపు బీజేపీ అధినాయకత్వం   వచ్చే ఎన్నికల నాటికీ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనీ సంకల్పం పెట్టుకున్నారట. మరి ఈ గడ్డు పరిస్థితుల నుండి  బాబు తన పార్టీని ఎలా కాపాడుకుంటారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: