చాలామందికి ఇదే అనుమానాలు మొదలయ్యాయి.  చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో పార్టీకి సంబంధించిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి ఫిరాయించటం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్లు అనుమానంగా ఉంది. బిజెపిలోకి ఫిరాయించిన ఎంపిలందరూ చంద్రబాబు అనుమతితోనే బిజెపిలోకి చేరినట్లు అనుమానంగా ఉంది.

 

మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించి  టిడిపికి 40 శాతం ఓటు షేర్ వచ్చింది. అదే విధంగా బిజెపికి దక్కిన ఓటు షేర్ కేవలం 1 శాతం మాత్రమే. అలాంటిది 40 శాతం ఓట్ షేర్ దక్కించుకున్న పార్టీ నేతలు 1 శాతం ఓటు షేర్ మాత్రమే దక్కించుకున్న బిజెపిలో చేరటంతోనే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే తాము బిజెపిలోకి చేరినట్లు ఫిరాయించిన ఎంపిలు సుజనాచౌదరి, టిజి వెంకటేష్, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు చెప్పుకోవటం కూడా నమ్మదగ్గదిగా అనిపించటం లేదు. పైగా ప్రజల తీర్పుకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నట్లు టిజి వెంకటేష్ చెప్పటం విచిత్రంగా ఉంది.

 

టిజి చెప్పిందే నిజమైతే వాళ్ళు చేరాల్సింది బిజెపిలో కాదు వైసిపిలో.  ఎందుకంటే ఏపిలో వైసిపికి 50 శాతం ఓట్లేసిన ఇదే జనాలు బిజెపిని పూర్తిగా తిరస్కరించారు. సో, ఇవన్నీ చూస్తుంటే బిజెపిలోకి ఫిరాయించిన ఎంపిల్లో ఇద్దరు తమపై ఉన్న కేసుల నుండి రక్షణ కోసమే చేరినట్లు అర్ధమైపోతోంది. సుజనా, సిఎం రమేష్ లపై సిబిఐ దాడులు చేయటం, కేసులు నమోదు చేయటం అందరికీ తెలిసిందే.

 

పైగా గడచిన ఐదేళ్ళ పాలనలో జరిగిన అవినీతిని జగన్మోహన్ రెడ్డి తవ్వితీస్తుంటే చంద్రబాబుపైన కూడా తొందరలోనే కేసులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తనను తాను రక్షించుకోవాలన్నా కూడా చంద్రబాబుకు కేంద్రం అండ చాలా అవసరం. ఇప్పటికిప్పుడు చంద్రబాబు బిజెపిలోకి వెళ్ళే అవకాశాలు తక్కువ కాబట్టి ముందుగా తన మద్దతుదారులైన రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపారనే ప్రచారం కూడా మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: