టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై ఆయన సూటిగా చేసిన విమర్శలు సరైనవేనని టీడీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడ్డాయి. ఎంపీ కేశినేని నాని విమర్శలను టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. అంటే పక్కా ప్రణాళికతోనే టీడీపీ మెజార్టీ ఎంపీలు చంద్రబాబుపై తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పాలని తామెంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని ఎంపీలు అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కేవలం తన కుమారుడు లోకేశ్‌ను భావి నేతగా తీర్చిదిద్దాలన్న స్వార్థంతో పార్టీ పుట్టి ముంచారని ధ్వజమెత్తుతున్నారు. తిరుగులేని మాస్‌ లీడర్‌గా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే వ్యూహలే లేకుండా పోయాయని పేర్కొంటున్నారు.

వైఎస్‌ జగన్‌ అంతటి ప్రజాదరణ ఉన్న నేత టీడీపీలో లేనందున కనీసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుందామన్నా చంద్రబాబు వినిపించుకోలేదని ఎంపీలు విమర్శిస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు, పవన్‌ కల్యాణ్‌తో లోపాయికారీ పొత్తు రాజకీయంగా టీడీపీని దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇక కోలుకోవడం అసాధ్యమని ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌ అసమర్థత టీడీపీకి ప్రతికూల అంశాలని విశ్లేషిస్తున్నారు. టీడీపీలో ఇంకా కొనసాగడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమని మెజార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నందున ఆ పార్టీలో చేరడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: