అవును!  నీతులు చెప్పే నాయ‌కులు వాటిని పాటించ‌క‌పోతే.. స‌భ్య‌స‌మాజం ఎలా ఊరుకుంటుంది?  పైగా ఇప్పుడు సోష ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక‌.. ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్ర‌జ‌లు త‌మ అబిప్రాయాల‌ను ఎక్క‌డా దాచుకో వ‌డం లేదు. నిర్భీతిగా వెల్ల‌డిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తు న్న ప్ర‌జ‌లు.. ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడిని ఎత్తిపొడుపుల‌తో దేబిరిస్తున్నారు. నాయుడు గారు.. అని మ‌ర్యాద‌గా పిలుస్తూ.. ఇలా చేస్తారా సార్‌! ఇది మీకు భావ్య‌మా? అని అంటున్నారు. నిజానికి రాజ‌కీయాల్లో అయితే, ఏదైనా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. 


కానీ, రాజ్యాంగ బ‌ద్ధంగా ఏర్ప‌డిన ప‌ద‌విలో ఉన్న రాజ్య‌స‌భ‌ చైర్మ‌న్‌.. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు కూడా ఇప్పుడు టీడీపీ నుంచి వ‌చ్చిన న‌లుగురు ఎంపీల‌ను బీజేపీలో విలీనం చేయ‌డాన్ని స‌మ‌ర్ధిస్తూ.., ప‌చ్చ‌జెండా ఊపారు. వాస్త‌వానికి కొన్నాళ్ల కింద‌ట వెంక‌య్య ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక జేడీయూ నాయ‌కుడు శ‌ర‌ద్ యాద‌వ్‌పై పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ప్ర‌కారం వేటు వేశారు. ఇలా ఫిర్యాదు వ‌చ్చిందో లేదో ఆయ‌న అలా చ‌ర్య‌లు తీసుకుని.. దాదాపు 20 నిమిషాల పాటు ఆయ‌న స‌భ‌లో ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించేది లేద‌ని, ఇలా అయితే, దేశంలో ఏపార్టీ కూడా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి లేద‌ని దంచికొట్టారు. 


కానీ, ఇప్పుడు టీడీపీ నుంచి వ‌చ్చి న సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేష్ స‌హా మ‌రో ఇద్ద‌రిని క‌లిపి గుండుగుత్తుగా బీజేపీలోకి చేర్చుకుంటున్న‌ట్టు తీర్మానించారు. ఈ ప‌రిణామం నిజంగా నాయుడిగారిపై విమ‌ర్శ‌ల జోరును పెంచింది. రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడు కాబ‌ట్టి విమ‌ర్శ‌ల‌కు అతీతుడే అయినా.. కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌నే మ‌రిచిపోవ‌డంపై సోష‌ల్ మీడియా చూస్తూ ఊరుకోవ‌డం లేదు. మీరు కూడా ఫ‌క్తు రాజ‌కీయ నేత‌లా వ్య‌వ‌హ‌రిస్తారా?  సార్ అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యం.. నేరుగా వెంక‌య్య‌పైనే మ‌చ్చ ప‌డేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: