త‌ప్పు చేసిన వారు త‌ప్పించుకుంటే చ‌ట్టం ఒప్పుకోదు! ఇది స‌మాజంలోని అన్ని రంగాల్లోనూ మ‌నం చూస్తున్న‌దే. అయి తే, మ‌రి రాజ‌కీయ మాటేంటి?  చంద్ర‌బాబు పార్టీ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. అదేవిధంగా ఇప్పుడు న్న నాయ‌కులు కానీ, పార్టీ కార్య‌క‌ర్త‌లు కానీ ఎలాంటి సంతృప్తీ లేకుండా ఉన్నారు. మ‌రి ఈ ప‌రిణామాల‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు? ఎవ‌రు పార్టీని ఓడించారు? ఎవ‌రు పార్టీని కాపాడాలి?  ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి దాదాపు నెల రోజులు వ‌స్తున్నా.. దీనిపై ఆత్మ విమ‌ర్శ చేసుకున్న దాఖ‌లా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప‌క్క నాలుగు రోజులకు ఒక‌సారి చంద్ర‌బాబు స‌మీక్ష‌లు చేస్తున్నా.. ఎలాంటి ఫ‌లితం లేకుండా పోతోంది.


పైగా.. ``నాకే ఎక్క‌డా లోపాలు క‌నిపించ‌డం లేదు. అస‌లెలా ఓడిపోయాం`` అని బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌రింత విస్మ‌యం క‌లిగిస్తోంది. రాజ‌కీయంగా లోపాలు లేకుండా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి అగ‌మ్యంగా మార‌కుండా అతిపెద్ద ప్రాంతీయ పార్టీ.. జాతీయ చ‌క్రం తిప్పాల‌ని ఉవ్విళ్లూరిన పార్టీ ఇలా గోతిలో ప‌డిపోవ‌డానికి కార‌ణం కాదంటే.. అధినేత న‌మ్మ‌లేరా? ఇలాంటి విశ్లేష‌ణ‌లు రోజూ కోకొల్ల‌లుగా సోష‌ల్ మాధ్య‌మాల‌ను నింపేస్తున్నారు. కుప్ప‌లు తెప్ప‌లుగా పార్టీల‌కు అతీతంగా టీడీపీలో ఏదో లోపం ఉంద‌ని బాహాటంగానే చెబుతున్నారు. అయినా కూడా చంద్ర‌బాబు.. ఈ దిశ‌గా దృష్టి పెట్ట‌లేదు. 


నిజానికి 2014 ఎన్నిక‌ల‌కు ముందున్న ప‌రిస్థితి ఒక్క‌సారిగా 2019 నాటికి మారిపోయింది. గుడ్డిలో మెల్ల మాదిరిగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా సంపాయించుకున్న‌దే త‌ప్ప‌.. గౌర‌వ ప్ర‌ద‌మైన స్తానాల‌ను టీడీపీ ద‌క్కించుకోలేక పోయింద‌నేది వాస్త‌వం. ఈ వాస్త‌వాన్ని క‌నుమ‌రుగు చేస్తే.. అయ్యేది కాదు. త‌న పాల‌న‌ అంతా బాగున్న‌ట్టుగా, సంతృప్తి స్థాయి కొద్ది దూరంలో వంద‌కు చేరువ అయింద‌ని చెప్పిన‌ట్టుగా నిత్యం క‌థ‌లు చెప్పిన‌ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి.. ఒక‌సారి ఘోరంగా దెబ్బ‌తిన్న చంద్ర‌బాబు.. పార్టీ విష‌యంలోనూ ఇదే త‌ర‌హాతో ఉండ‌డం ఇప్పుడు కూడా పార్టీలో లోపాలు లేవ‌నేలా పాట పాడడం నిజంగానే విస్మ‌యానికి గురి చేస్తోంది. 


క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ పార్టీ తాజాగా జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. దీనికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు విశ్వ‌నాథ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మ‌రి క‌నీసం ఇలాంటి బాధ్య‌త‌ను టీడీపీలో ఏ ఒక్క‌రూ తీసుకోలేక పోయారు. ఏపీలో ఘోర ప‌రాజ‌యం ద‌రిమిలా.. పార్టీకి రాష్ట్రంలో అధ్య‌క్షుడిగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు కానీ, జాతీయ స్థాయిలో అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్పిన చంద్ర‌బాబు కానీ, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్ కానీ పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హించ‌లేక పోయారు. అదేవిధంగా పొలిట్ బ్యూరో స‌భ్యులుగా చంద్ర‌బాబుకు స‌ల‌హాలు ఇచ్చిన వారు కూడా ఇప్పుడు మౌనం వ‌హించారు. ఈ మొత్తం ప‌రిణామం ఇలానే ఉంచుకుని.. కార్య‌క‌ర్త‌ల‌పై నెపం నెట్టే ప‌ని పెట్టుకుంటే.. ప‌రిస్తిని ఎవ‌రు చ‌క్క‌దిద్దుతారో బాబుకే తెలియాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: