గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధి, గిరిజ‌న జీవితాల‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పు తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో సిఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. గురువారం స‌చివాల‌యంలో వేద‌పండితుల ఆశీర్వ‌చ‌నం మ‌ధ్య పుష్ప శ్రీవాణి త‌న ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌రుక్ష‌ణం శ్రీ‌వాణి క‌మ్యునిటీ వ‌ర్క‌ర్ల‌కు జీతాల పెంపుకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంత‌కం చేసారు. గిరిజ‌న సంక్షేమ శాఖ సంచాల‌కులు గంధం చంద్రుడు ఈ విష‌యం గురించి మంత్రికి వివ‌రించి తొలి సంత‌కం చేయించారు.

దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే తొలిసారి గిరిజ‌నుల‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చిన ఘ‌న‌త సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి, గిరిజన సంక్షేమంశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి అన్నారు. టీడీపీ సర్కార్ నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల పాటు క‌నీసం ఒక గిరిజ‌న స‌భ్యుడిని మంత్రిగా కూడా చేయ‌లేక‌పోయింద‌ని ఆమె ఆరోపించారు. నాటి ముఖ్య‌మంత్రి క‌నీసం గిరిజ‌న స‌ల‌హా మండ‌లిని కూడా ఏర్పాటు చేయ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు.

గిరిజ‌న సంక్షేమం విష‌యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, క‌మ్యునిటీ హెల్త్ వ‌ర్క‌ర్‌లు ఆశా వ‌ర్క‌ర్ల మాదిరే ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ వారికి కేవలం రూ.400 మాత్ర‌మే చెల్లిస్తున్నార‌న్న‌విష‌యం తెలుసుకుని, తొలి క్యాబినేట్ భేటీలోనే వారి వేత‌నాల‌ను రూ.4000ల‌కు పెంచార‌న్న విష‌యాన్ని శ్రీ‌వాణి గుర్తు చేసారు.

గిరిజ‌న సాంప్ర‌దాయాల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తామ‌ని, ఇక్క‌డి సంస్కృతిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తామ‌ని వివ‌రించారు. గిరిజ‌న ప్రాంతాల‌లో ఐటిడిఎ ద్వారా ప‌రిపాల‌న జ‌రుగుతుండ‌గా, అక్క‌డ పాల‌నా ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకురానున్నామ‌న్నారు. స‌మ‌ర్ధులైన అధికారుల సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకుంటామ‌ని, మంచి చేసేవారిని స‌న్మానిస్తామ‌ని, అదే క్ర‌మంలో త‌ప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: