గురువారం నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలో కలిసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ, మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారన్నారు.

చంద్రబాబుకు అండగా ఉండి.. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ శ్రేణులను కాపాడాల్సిన స్థితిలో ఇలా టీడీపీని విడటం సరికాదని ఉమా పేర్కొన్నారు. 1984 ఆగస్టు సంక్షోభంలో లక్షలాది మంది కార్యకర్తలు పోరాటం చేసి ఎన్టీఆర్‌ని మరోసారి ముఖ్యమంత్రిని చేశామని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబును సంప్రదించకుండా... ఆయన లేని సమయంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం మంచిది కాదన్నారు.

1989లో ఘోర పరాజయం పాలైనా 1994లో మరోసారి అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఎంతోమంది నేతలు, స్వార్థపరులు, అవకాశవాదులు పార్టీని వీడినా కార్యకర్తలు మాత్రం టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారని ఉమా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మరెన్నో కారణాలతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నా 2014లో మరోసారి అధికారంలోకి వచ్చామని ఆయన తెలిపారు. తాజాగా మరోసారి అధికారం కోల్పోయినా కార్యకర్తలు ధృడంగా నిలబడ్డారని.. కానీ ఐటీ, ఈడీ, సీబీఐ కేసులకు భయపడి పిరికిపందల్లా పార్టీ మీద బురదజల్లుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: