రాజకీయాల్లో విలువలు గురించి , ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడే ఏకైక నాయకుడు వెంకయ్యనాయుడు. పతనం అంచున ఉన్న రాజకీయాల పై అయన అనేక ఛలోక్తులు విసురుతూ, కొన్ని సార్లు ఆవేదన పడుతుంటారు. ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేస్తుంటారు.

 '' పార్టీ ఫిరాయింపుల జాడ్యం ఇటీవల ఎక్కువైపోయింది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం శ్రుతిమించింది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఉంది. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై సభాపతులు మూడు నెలల్లో తీర్పు ఇవ్వాలి. అవసరమైతే చట్టంలోనూ మార్పు చేయాలి. పార్టీలు మారితే మారొచ్చు. కానీ, పదవికి రాజీనామా చేసి మారాలి. ఫిరాయింపు పిటిషన్లపై కోర్టులు కూడా వెంటనే తీర్పు చెప్పాలి.'' డిసెంబరు 5న , కృష్ణా జిల్లా లోని ఆత్కూరులో ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నోటి నుండి వెలువడిన ఆణిముత్యాలు అవి. 


నెల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మరోసారి ఉప రాష్ట్రపతి తీవ్రమైన ఆవేదనతో ఇలా అన్నారు... '' ఈ మధ్య కాలంలో రాజకీయవ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, జరుగుతున్న ఫిరాయింపులను చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీ ఫిరాయింపులపై లెజిస్లేటివ్‌ ప్రిసైడింగ్‌ అధికారులు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి.'' అని కుండ బద్దలు కొట్టారు, వెంకయ్యనాయుడు . దేవుడు స్రిప్ట్‌ రాసినట్టుగా ఈ ఫిరాయింపుల గొడవ ఆయన ముందుకే వచ్చింది.

వెంకయ్య ఇప్పుడేం చేస్తారోనని విలువల కోసం తపించే వారు ఆసక్తిగా చూస్తున్నారు. ఫిరాయింపులపై పదేపదే ఆవేదన వ్యక్తం చేస్తున్నఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంక్యనాయుడు, రాజ్యసభలో నలుగురు టీడీపీ సభ్యులు బీజేపీలో చేరడాన్ని ఆ పార్టీ విలీనంగా పరిగణిస్తారా లేదా? అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. 


శుక్రవారం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. రాజకీయాల్లో నైతికత గురించి ఇటీవల అనేక సందర్భాల్లో మాట్లాడిన వెంకయ్య ఈ అనైతిక విలీనాన్ని ఆమోదించకుండా రాజకీయాల్లో విలువలకే ప్రాధాన్యత ఇస్తారని ప్రజాస్వామిక వాదులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: