ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడ నగరాల్లో సంస్థ ఆధ్వర్యంలో తొలి విడత 350 విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు. బస్సులను రూ.764 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.

 

ఇందులో కేంద్రం నుంచి రూ.187.50కోట్ల సాయం కోరుతూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన కార్యాలయంలో గురువారం మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 

దివ్యాంగులకు రాయితీపై ఇస్తున్న బస్‌పాస్‌ల రెన్యువల్‌ గడువును మూడేళ్లకు పొడిగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. లెర్నర్‌ లైసెన్సు రిజిస్ట్రేషన్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌)ల కోసం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) కార్యాలయాల్లో జులై ఒకటి నుంచి ఆన్‌లైన్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా ఫిట్‌నెస్‌ లేని 357 బస్సులను జప్తు చేశామని, 624 కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. ఇంకా 5,350 బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్నాయని, వీటిల్లో విద్యార్థులను పంపొద్దంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: