తెదేపాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు నాలుగైదు రోజుల్లో హైదరాబాద్‌ లేదా దిల్లీలో సమావేశమవబోతున్నారు.  పార్టీలో కొనసాగాలా? మారాలా? అని తర్జనభర్జన పడుతున్న నాయకులు ఒక స్పష్టత కోసం ఈ సమావేశాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిలో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం వంటి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

 

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో కాకినాడలో జరిగిన సమావేశంలో.. పార్టీలో ఇటీవల పరిణామాలపై  చర్చించుకున్నారు. సమావేశం ఎజెండా ఏంటో దీనికి హాజరైన వారిలో చాలా మందికి ముందు అంత స్పష్టంగా తెలియదు. కాపులంతా పవన్‌ కల్యాణ్‌ వెంటే ఉన్నారన్న భావన ఇటీవల పార్టీలోనూ, బయట బాగా వ్యాప్తి చెందిందని, అది తప్పని, తెదేపాలోని కాపు నాయకులంతా సమష్టిగా పార్టీ వెంటే ఉన్నామని స్పష్టం చేయడానికే సమావేశం పెడుతున్నామని వారికి చెప్పారు.

 

ఇటీవల ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణాలతోపాటు, చంద్రబాబు తర్వాత పార్టీని నడపగల సత్తా లోకేశ్‌కి ఉందా? అన్న కోణంలోనూ చర్చించారు. సంఘటితంగా వ్యవహరించాలని, చంద్రబాబు పిలిచినా అందరూ కలిసే వెళ్లి మాట్లాడాలని, స్థానిక  ఎన్నికల్లోనైనా కాపులకు సముచిత ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి పెంచాలన్న చర్చ జరిగింది. తదుపరి సమావేశాన్ని విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు.

 

కాపు నేతల మాదిరిగానే... మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకులు కొందరు నాలుగైదు రోజుల్లో సమావేశం కాబోతున్నారు. వారిలో కొందరు భాజపాలోకి వెళ్లే ఆలోచనలో  ఉన్నారని, అదే ఎజెండాతో సమావేశం నిర్వహించబోతున్నారని గుప్పుమనడంతో కలకలం రేగింది. ఐరోపా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ పరిణామాలపై పార్టీ నాయకులతో  ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: