తెలుగుదేశం పార్టీలో మ‌రో క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే న‌లుగురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌గా....మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుపై గుస్సాతో ఉన్న త‌రుణంలో..ఇంకో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్‌పై టీడీపీ నేత‌లు ప‌లువురు తిరుగుబాటు చేసినంత ప‌ని చేశారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కాపు సామాజికవర్గ ముఖ్య‌నేత‌లంతా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నాయకత్వంలో కాకినాడలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. తెలుగుదేశం భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఉంటే తమక్కూడా భవిష్యత్‌ ఉండదని ఆవేదన చెందారు. ప్రత్యామ్నాయం చూసుకోవాల‌ని డిసైడ‌య్యారు.


తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు, కాపు సామాజికవ‌ర్గ ప్ర‌ముఖులు జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, మాధవ నాయుడు, ఈలి నాని, పంచకర్ల రమేష్‌బాబు, బోండా ఊమ, బడేటి బుజ్జి, బూరగడ్డ వేదవ్యాస్‌, కదిరి బాబూరావు, చెంగల్రాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన తాజా మాజీ టీడీపీ కాపు ఎమ్యెల్యే ల రహస్య సమావేశంలో లోకేష్ పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్త‌మైన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో కాపులకు జరుగుతున్న అన్యాయంపై చర్చ లోకేష్ టార్గెట్‌గా జరిగింద‌ని స‌మాచారం. లోకేష్ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు  అభిప్రాయం వ్యక్తం చేశారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేష్ ఎక్కువ సమయం ఇచ్చేవార‌ని ఓ నేత మండిప‌డ్డ‌ట్లు స‌మాచారం. కాపు సామాజిక వర్గాన్ని పట్టించుకోవడంలేదన్న మాజీలు త‌మ ప్రజాప్రతినిధులు కలవడానికి కూడా సమయం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.


కాగా, ఒక మీడియా సంస్థ యజమాని చెప్పిన వారికే ఎన్నికల్లో సీట్లు, కోట్లు ఇచ్చారనే అభిప్రాయం సైతం చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని తెలుస్తోంది.  ఎన్నికల్లో నిధులు కూడా ఒక సామాజిక వర్గం వారికే ఎక్కువ ఇచ్చారని మెజార్టీ వారు అభిప్రాయప‌డ‌టం గ‌మ‌నార్హం. కాపులకు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఇవ్వలేదు.. ఉన్నవారిని పక్క నియోజకవర్గలకు మార్చార‌ని మ‌రో నేత అభిప్రాయ‌ప‌డ్డారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా....టీడీపీలో ఉన్న కాపులు పార్టీ మారలేదని అయినా.... టీడీపీలో కాపులను అనుమానంగా చంద్రబాబు లోకేష్ చూసేవారని పేర్కొన్నారు. మీసాల గీతకు సీటు ఇవ్వలేదని, కదిరి బాబూరావుకు వేరే చోట సీటు ఇచ్చారని పేర్కొన్నారు.ఈ విష‌జ్ఞ‌మై తేల్చుకోవాల‌ని ఈ నేత‌లు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: