తలాపునే వేల టీఎంసీల గోదావరిజలాలు పారుతున్నా.. వంద టీఎంసీల వినియోగానికి సైతం మొహం వాచిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు 500-600 టీఎంసీల వినియోగానికి సమాయత్తమవుతున్నది. గోదావరి బేసిన్‌లో 954 టీఎంసీల వాటా జలాలున్నా పట్టుమని పదిశాతం వాడుకోలేని తెలంగాణ గడ్డ.. ఇప్పుడు ఏకంగా 60-70 శాతం వినియోగ లక్ష్యాన్ని సాధించబోతుంది. కడలి వైపు సాగే జలాలకు కాళేశ్వరం వద్ద అడ్డుకట్టతో ఇది సాక్షాత్కారం అయింది. గోదావరి జలాలను ఒడిసిపట్టే వనరులు లేక ప్రతిఏటా వేల టీఎంసీలు కడలి పాలయ్యేవి. కేంద్ర జలసంఘం అధికారిక రికార్డుల్లో దశాబ్దాలుగా నమోదయిన లెక్కలు ఇదే చెప్తున్నాయి. గోదావరి జలాలను ఎగువన ఉన్న మహారాష్ట్ర మాత్రమే మెరుగ్గా వినియోగించుకుంటోంది. దిగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు అనేక వాగులు, వంకల ద్వారా వచ్చే భారీస్థాయి జలాలను వాడుకొనే పరిస్థితి లేకుండాపోయింది. నేడు కాళేశ్వరం ద్వారా తెలంగాణకు ఆ సదవకాశం వచ్చింది. 


సీఎం కేసీఆర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం ఉదయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం జ‌రిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద మహా ఘట్టం జ‌రిగింది. శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించడంతోపాటు మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద హోమాలు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజర‌య్యా. మహారాష్ట్ర, ఏపీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.  


 సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు ఎర్రవెల్లి గ్రామం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి నుంచి ఉదయం 7.50 గంటలకు హెలికాప్టర్‌లో నేరుగా మేడిగడ్డకు వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉదయం 8 గంటలకు నాందేడ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకొని అక్కడినుంచి మేడిగడ్డ బరాజ్‌కు చేరుకున్నారు. ఉదయం 8.30 గంటలకు మేడిగడ్డ బరాజ్ వద్ద నిర్వహించే పూజాకార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం విశిష్ట అతిథి గవర్నర్ సమక్షంలో ముఖ్యఅతిథులతో కలిసి ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బరాజ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకున్నారు. ఉదయం 10.50 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల ద్వారా నీటి విడుదల చేశారు. అనంతరం అతిథులతోకలిసి డెలివరీ సిస్టర్న్ వద్దకు వెళ్లి గోదావరిజలాలు పైపుల ద్వారా ఎగిసిపడే దృశ్యాల్ని వీక్షిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లిలోనే సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి భోజనం చేస్తారు. ప్రారంభోత్సవంలో భాగంగా కాళేశ్వరం పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా అతిథులు వీక్షిస్తారు.


సీఎం కేసీఆర్ మేడిగడ్డ బరాజ్‌తోపాటు కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటిని విడుదలచేయనుండగా.. మిగతా కీలక నిర్మాణాల వద్ద రాష్ట్ర మంత్రులు పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రానికే పలువురు మంత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. అన్నారం పంపుహౌస్ వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి, సుందిల్ల పంపుహౌజ్ వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్యాకేజీ-6లో భాగంగా నందిమేడారం పంపుహౌస్‌లో మంత్రి మల్లారెడ్డి, ప్యాకేజీ-8లో భాగంగా రామడుగు పంపుహౌస్‌లో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పూజలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నెపల్లి పంపుహౌస్ వద్ద పూజలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: