అవినీతి కేసుల నుండి రక్షణ కోసమే టిడిపి ఎంపిలు పార్టీలు మారారా ? ఇపుడిదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఎంపిలు బిజెపిలో చేరటంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పైగా నలుగురిలో ఇద్దరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. సిబిఐ, ఈడి, ఐటి దాడులు కూడా జరిగాయి.

 

బ్యాంకులను వేల కోట్ల రూపాయలకు ముంచిన సుజనా చౌదరి, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను వేలాదికోట్లకు పెంచేసి ప్రజా ధనాన్ని దోచేసిన సిఎం రమేష్ గురించి అందరూ ఫోకస్ పెట్టారు. టిడిపిలోని ఆరుగుతు రాజ్యసభ సభ్యుల్లో సుజనా, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లు గురువారం రాత్రి బిజెపిలోకి ఫిరాయించారు.

 

సుజనా, రమేష్ లు తమపై దర్యాప్తు సంస్ధలు దాడులు జరిగినపుడు నరేంద్రమోడిని నోటికొచ్చినట్లు విమర్శించారు. ఈరోజే రేపో పై ఇద్దరు ఎంపిల అరెస్టు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే వారు బిజెపిలో చేరారంటే అర్ధమేంటి ? వాళ్ళు చేరాలని అనుకోవటం ఒక ఎత్తు, కేసులున్న ఎంపిలను పార్టీలోకి చేర్చుకోవటం మరో ఎత్తు. వీళ్ళల్లో ముగ్గురు చంద్రబాబు బినామిలుగా ప్రచారంలో ఉంది.

 

చేరేవాళ్ళు తమ అవసరాల కోసం బిజెపిలో చేరారని అనుకున్నా ప్రతిరోజు విలువల గురించి మాట్లాడుతూ, అవినీతిని సహించేది లేదని చెప్పే కమలనాధులు వాళ్ళని చేర్చుకోవటంతో సమాజానికి ఏమని సంకేతాలు ఇస్తున్నట్లు ? అంటే బిజెపి అగ్రనేతలు చెప్పేదొకటి చేసేదొకటి అన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది.

 

నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్ధలు నిక్కచ్చిగా విచారణ జరిపుంటే ఈ పాటికే సుజనా అరెస్టయ్యుండేవారనటంలో సందేహం లేదు. వందలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిసిగ్గుగా దోచేసిన సుజనా, సిఎం రమేష్ లు బిజెపిలో చేరారంటే కేసుల నుండి రక్షణ కోసం తప్ప మరోటి కాదన్న విషయం అర్ధమైపోతోంది.  ఎందుకంటే సుజనా అయినా సిఎం రమేష్ అయినా చంద్రబాబు బినామీలే అన్న ప్రచారం అందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: