హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ మఠం వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌.. జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎం.వెంకటరమణతో ప్రమాణం చేయించారు.

 

జడ్జీల నియామక పత్రాల్ని నూతన జడ్జిలకు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ అందజేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జిలుగా వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారానంతరం ఏసీజే జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనంలో జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ కేసుల విచారణ జరిపారు.

 

జస్టిస్‌ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్‌ ఎం.వెంకటరమణ కేసులను విచారించారు. న్యాయమూర్తులుగా ఈ ఇద్దరి తాజా నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 13కు చేరింది. ఏపీకి మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 37. ఇంకా 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, నూతనంగా ప్రమాణం చేసిన న్యాయమూర్తుల తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జడ్జిలను బంధుమిత్రులు, పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: