ఆడలేక మద్దెల దరువు అన్నట్లుగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు పరిస్థితి. ఎన్నికలకు ముందు వీరలెవల్లో గెలుస్తాం అంటూ రెచ్చిపోయిన ఈ మెగా సోదరులు ఇద్దరు జనసేనను గెలిపించుకోవడం కాసేపు పక్కన పెడితే... తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓడిపోయారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. అయితే పవన్ గాజువాకలో ఏకంగా మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.


ఇక తన అన్న నాగబాబును ఎన్నో ఆశలతో తమ సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని... సొంత ప్రాంతం అయిన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. నాగబాబు కూడా ఘోరంగా ఓడిపోయినా మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఇలా మెగా సోదరులు ఇద్దరు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న నాగబాబు తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చారు. నెటిజన్లను అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు.


ఈ క్రమంలోనే జనసేన ఘోరమైన ఓటమికి తన సోదరుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టే నాగబాబు కూడా కుంటి సాకులు చెప్పడం విశేషం. ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఏకంగా 150 కోట్లు ఖర్చు చేశారని పవన్ చెప్పారని... కానీ భీమవరం, గాజువాకలో పవన్‌ను ఓడించేందుకు అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారని... నాగబాబు కూడా తమ్ముడు పాడిన పాత పాటనే మరోసారి పాడారు. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం కూడా ఎన్నికల్లో కొందరికి లాభం కలిగేలా పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు.


ఏదేమైనా రాజకీయాల్లో సహజంగానే ధనం, మద్యం, ఎత్తులు... పై ఎత్తులు, వ్యూహాలు పనిచేస్తుంటాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరైనా వీటిని వాడుతుంటారు. అంతిమంగా గెలుపు అన్నది ముఖ్యం. మెగా సోదరులు తమ ఓటమిని అంగీకరించ‌లేక కాకమ్మ కథలు బాగానే చెబుతున్నారని సెటైర్లు పడిపోతున్నాయి. ఇక నాగబాబు తన అన్న చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా గురించి కూడా మాట్లాడారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కలెక్షన్లు గొప్పగా ఉంటాయని.... దేశవ్యాప్తంగా అందరిని ఆకట్టుకునే గొప్ప సినిమాగా చరిత్రలో నిలిచిపోతుందని హామీ ఇచ్చారు. అదే క్రమంలో బాహుబలి సినిమాతో సైరాను పోల్చ‌వ‌ద్ద‌ని కూడా సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: