ఒక హోటల్‌లో సుమారు 2 గంటలపాటు వీరి సమావేశం జరిగింది. కాపు సామాజికవర్గానికి చెందిన తెదేపా ముఖ్య నాయకులు గురువారం కాకినాడలో భేటీ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినవారు. రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చొరవతో జరిగిన ఈ సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన కాపు నాయకులు 13 నుంచి 15 మంది దాకా హాజరయ్యారు.

 

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, విజయనగరం జిల్లా నుంచి మీసాల గీత, కె.ఎ.నాయుడు, విశాఖ జిల్లా నుంచి పంచకర్ల రమేశ్‌బాబు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బడేటి కోట రామారావు (బుజ్జి), ఈలి నాని, బండారు మాధవ నాయుడు, కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమామహేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యాస్‌, ప్రకాశం జిల్లా నుంచి కదిరి బాబూరావు, కడప జిల్లా నుంచి చెంగల్రాయుడు పాల్గొన్నారు.

 

భేటీ రహస్యంగానే మొదలైనా... కాసేపటికే కాపు నాయకులు సమావేశమయ్యారన్న వార్త గుప్పుమంది. ఒకపక్క తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు భాజపాలో చేరడం... అదే సమయంలో పార్టీలో ముఖ్యులైన కాపు నాయకులు సమావేశమవడం తెదేపా వర్గాల్లో కలకలం సృష్టించింది. పార్టీ మారేందుకే వీరంతా ఒకచోట కలిశారన్న ఊహాగానాలు జోరుగా సాగాయి.

 

సమావేశమైన నేతలంతా ఒకే పార్టీకి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, పార్టీ కార్యాలయం అందుబాటులో ఉన్నా హోటల్‌లో సమావేశమవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. వారు భాజపాలో చేరతారా? వైకాపాలోకి వెళ్తారా..? అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడిచింది. కానీ తాము తెదేపాను విడిచిపెట్టేది లేదని... సమావేశం ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ నాయకులంతా స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: