ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారన్న కారణం చూపిన తెలంగాణ జనం... ఓదార్పు యాత్ర పేరిట వరంగల్ జిల్లాకు పయనమైన జగన్ పైకి మహబూబాబాద్ పరిధిలోని మానుకోట వద్ద రాళ్లేశారు. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తున్న మీరు మా ప్రాంతంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ జనం నాడు భీష్మించారు.

 

జగన్ కు స్వాగతం పలికేందుకు నాడు వైసీపీలో ఉన్న కీలక నేతలు కొండా సురేఖ దంపతులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ఉండగా వారిపైకి పెద్ద ఎత్తున దాడి యత్నం జరిగింది. నలుదిక్కుల నుంచి రాళ్లు పడుతుంటే... బక్కచచ్చిన కొండా దంపతులు, వైసీపీ నేతలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో జగన్ ఎక్కిన రైలును మానుకోట వద్దే ఆపేసిన పోలీసులు... భద్రత కల్పించలేం, వెనక్కెళ్లండంటూ జగన్ ను కోరారు.

 

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్... తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ వెళితే... గులాబీ దళపతి ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. ఇక తెలంగాణలో కీలక ప్రాజెక్టుగా పరిగణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావాలంటూ జగన్ ను కేసీఆర్ ఆహ్వానించారు. జగన్ కూడా వస్తానని చెప్పారు.

 

ఈ క్రమంలో అట్టహాసంగా జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ప్రారంభోత్సవం ఎక్కడో తెలుసా? కాళేశ్వరంలో కీలక బ్యారేజీగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ వద్దే. ఈ మేడిగడ్డ అటు మానుకోటకు, ఇటు మహబూబాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతమే. అంటే... జగన్ రావద్దని తిట్టినవాళ్ళే,  ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: