రాజ్యసభ కు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవర్ని నామినేట్ చేసిన వారు పార్టీ కి వెన్నుపోటు పొడవడం సర్వసాధారణమే అయింది. టీడీపీ తరుపున పెద్దల సభకు నామినేట్ అయిన వ్యక్తుల వివరాలు పరిశీలిస్తే, పదవి కాలం ముగిసిన తరువాతో, పదవిలో ఉండగానే వారు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పడమే, లేదంటే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంతో జరుగుతూ వస్తోంది  . టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు  ఎన్టీఆర్ నుంచి మొదలుకుని, నేటి వరకు అదే ఆనవాయితీగా కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది.


 టీడీపీ తరుపున రాజ్యసభ కు నామినేట్ అయినవారిలో సినీ నటుడు మోహన్ బాబు, ప్రస్తుతం వైకాపా లో కొనసాగుతుండగా, సినీ నటి జయప్రద బీజేపీ లో చేరారు. రేణుక చౌదరి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండగా, దివంగత  పి. ఉపేంద్ర కాంగ్రెస్ లో చేరారు . వంగా గీత తొలుత పీఆర్పీ ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం వైకాపా లో కొనసాగు తోంది. యలమంచిలి శివాజీ, తులసిరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం వైకాపా లో  చేరగా, గుండు సుధారాణి టీఆరెస్ లో చేరి, టీడీపీ కి షాక్ నిచ్చింది. ఇక టీడీపీ నుంచి రాజ్యసభ కు నామినేట్ అయినా వారిలో రామముని రెడ్డి , యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ లు ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటుండగా, మైసూరా రెడ్డి మాత్రం కొంతకాలం వైకాపా లో కొనసాగి అక్కడ ఇమడలేక, ప్రస్తుతం రాజకీయాలంటే అంటి, ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.


 తాజాగా టీడీపీ తరుపున రాజ్యసభ కు నామినేట్ అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి లు బీజేపీ లో చేరడమే కాకుండా, ఏకంగా పార్టీ రాజ్యసభ పక్షాన్నే ఆ పార్టీ లో విలీనం చేశారు. టీడీపీ తరుపున రాజ్యసభ కు నామినేట్ అయిన కంభంపాటి రామ్మోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి లు మాత్రమే పార్టీ లో నిబద్దతతో కొనసాగుతున్నారు. రాజ్యసభ నామినేట్ చేసిన వ్యక్తులు ఎంతవరకు పార్టీ పట్ల నిబద్ధతగా ఉంటారన్న కోణం లో కాకుండా, పార్టీ కి ఆర్ధికంగా సహాయపడ్డారని, మరే ఏ ఇతర కారణాలతో నామినేట్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: