తెలంగాణ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ని తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్, ఏపీ సీఎం జ‌గ‌న్, మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ క‌లిసి ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కంటే ముందు.. మేడిగడ్డ వద్ద నిర్వహించిన హోమంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

 

ప్రతిష్టాత్మక కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌పై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. అక్కినేని నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా నీరే జీవం !! ప్ర‌పంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ప్రారంభించినందుకు శుభాకాంక్ష‌లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ల అద్భుత ప్ర‌తిభ‌కి నిద‌ర్శ‌నం అని ట్వీట్ చేశారు. ర‌వితేజ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ అద్భుతాన్ని సాక్షాత్క‌రింప‌జేసినందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి అభినంద‌న‌లు తెలిపారు.

 

 

 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ రాష్ట్రానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఫడ్నవీస్‌ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు అందించిన కానుకగా పేర్కొన్నారు. రికార్డు వేగంతో ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: