ఏపీలో విపక్ష టిడిపి గురించి గంటగంటకు వస్తున్న వార్తలు ఆ పార్టీని నెలరోజుల్లోనే పూర్తిగా స్థాపితం చేసేలా కనిపిస్తున్నాయి. అదిగో పులి ఇదిగో మేక అన్న చందంగా ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించిన చంద్రబాబుకు ఇప్పుడు చుక్కలు చూపించేలా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీలో ఇప్పుడు టిడిపి నేతలు పార్టీ మార్పు ప్రచారం పీక్స్ లో ఉంది. ఎంపీల విషయంలో అమ‌లు చేసిన ఫార్ములానే బిజెపి ఎమ్మెల్యేల విషయంలో కూడా అమలు చేయబోతుందా ? అంటే రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా నడుస్తున్న చర్చ‌ల‌ ప్రకారం అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. 


ప్రస్తుతం ఏపీలో టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 13 మంది జంప్ అవుతారా ? ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి అసెంబ్లీలో అవతరించబోతోందా ? అంటే బిజెపి అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలను చూస్తుంటే కచ్చితంగా అదే జరుగుతుంది అన్న సందేహాలు ప్రతి ఒక్కరికి వచ్చేశాయి. ఇప్పటి వరకు చంద్రబాబు తన చుట్టూ ఉన్న పార్టీ నేతలను చూసి వీళ్లంతా నావాళ్లే అని అన్న‌ బ్రమలో మునిగితేలారు. కానీ వాస్తవంగా పార్టీ మారిన రాజ్యసభ సభ్యులంతా కాంట్రాక్ట్ పాలిటిక్స్ చేశారన్న విషయం వాళ్ళు బిజెపిలోకి వెళ్లాక‌ కానీ అర్థం కాలేదు.


ఇక ఇప్పుడు కాంట్రాక్టు ఆలోచనలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబుతో ఉంటే తమకు కలిసి వచ్చేది ఏంటి ? ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండాలి... ఆ తర్వాత రాజు ఎవరు ?  రెడ్డి ఎవరు ? అప్పుడైనా టిడిపి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదని భావించిన వాళ్ళంతా ముఠాగా ఏర్పడి ఇక ఇప్పుడు అంతా కలిపి ఓ నాయకుడిని కూడా సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జంపింగ్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ మాజీ మంత్రి ఆధ్వర్యంలో 13 మంది టిడిపి ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేసి ఢిల్లీలో వాలియేందుకు ఏర్పాట్లు నడుస్తున్నాయి.


ఒకప్పుడు టిడిపిలో ఉన్న ఆయన చిరంజీవి వెనకాల పోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి మంత్రి అయ్యాడు. తిరిగి టిడిపిలోకి వచ్చాక చంద్రబాబు ఎంతో నమ్మి మళ్లీ మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో బాబును, టీడిపిని ముంచేసి తన దారి తాను చూసుకోవడంతో పాటు మరో 13 మందికి కూడా దారి చూపించమన్నాడు. జంపింగ్ పాలిటిక్స్‌కు జంబో ఐకాన్ గా ఉన్న ఆ నేత ప్ర‌స్తుతం కొలంబోలో సేద తీరుతున్నాడ‌ట‌. అక్క‌డ నుంచి నేరుగానే ఢిల్లీ చెక్కేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా. త‌న‌తో పాటు వ‌చ్చే పేర్లు కూడా రాసుకుంటున్నాడ‌ట‌. ఏదేమైనా టీడీపీకి మ‌ద్దెల ద‌రువు అయితే స్టార్ట్ అయిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: