ఏపీలో వైసిపి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే కొన్ని చోట్ల ఆ పార్టీ నేతల మధ్య అప్పుడే చిచ్చు మొదలైంది. గెలుపు సంబరాలు ఉత్సాహం చ‌ల్లార‌క ముందే వర్గ పోరు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఇప్పుడు రెండు మూడు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టెక్క‌లి అసెంబ్లీ సీటుతో పాటు శ్రీకాకుళం ఎంపీ సీటు వైసిపి కోల్పోవలసి వచ్చింది. టెక్కలిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఓడిపోతారని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. అయితే అచ్చన్న చివర్లో పుంజుకుని గట్టెక్కారు. 


ఇక్కడ పోటీ చేసిన వైసిపి అభ్యర్థి పేరాడ తిలక్... కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి వర్గాల మధ్య ఏర్పడిన ముసలం టెక్కలి రాజ‌కీయాల్లో సెగలు రాజేస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఆమెను పార్టీలో చేర్చుకోవడం చాలా మంది నేత‌ల‌కుఇష్టం లేదు. ముఖ్యంగా పేరాడ తిల‌క్‌, దువ్వాడ శ్రీనివాస్ ఎన్నిక‌ల‌కు ముందు టెక్క‌లి సీటు కోసం పెద్ద యుద్ధం చేశారు. చివ‌ర‌కు జ‌గ‌న్ తిల‌క్‌కు టెక్క‌లి అసెంబ్లీ సీటు, దువ్వాడ‌కు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇవ్వ‌గా ఇద్ద‌రూ ఓడిపోయారు. 


జిల్లా అంత‌టా వైసీపీ గెలిచినా టెక్క‌లిలో ఓడిపోయింది. ఇదే ఇప్పుడు వైసీపీలో చిచ్చుకు కార‌ణ‌మైంద‌ట‌. టెక్క‌లిలో ఓట‌మి త‌ర్వాత కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడిన పేరాడ తిల‌క్  కృపారాణిని ఎవరూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని.. ఆమె వ‌ల్ల పార్టీకి ఒరిగిందేమి లేద‌ని... పైగా నా ఓట‌మికి ఆమె కూడా ఓ కార‌ణం అన్న తిల‌క్ ఈ విష‌యం ఎక్క‌డైనా ఓపెన్‌గానే చెపుతాన‌ని మ‌రీ స‌వాల్ చేశార‌ట‌.  ఈ వ్యాఖ్య‌లు కృపారాణి వ‌ర‌కు చేర‌డంతో ఆమె గుర్రుగా ఉంద‌ట‌.


కృపారాణి వ‌ర్గం త‌న‌కు స‌హ‌క‌రించ‌లేద‌న్న విష‌యాన్ని పార్టీ అధినేత‌కు కంప్లైంట్ చేస్తాన‌ని తిల‌క్ చెప్పార‌ట‌. ఇందుకు బ‌దులుగా కృపారాణి కూడా తాను పార్టీకి నిస్వార్ధంగా సేవ చేశాన‌ని... త‌న‌పై ఈ అభాండాలు ఏంటి.. తాను కూడా జ‌గ‌న్‌కు కంప్లైంట్ చేస్తాన‌ని కౌంట‌ర్ ఎటాక్ స్టార్ట్ చేసింద‌ట‌. పార్టీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు జెండామోసిన త‌మ‌ను కాద‌ని... కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై పేరాడ తిలక్ వర్గీయుల్లో అసహనం పెరిగిందనే చర్చ టెక్కలిలో జోరందుకుంది.  ఏదేమైనా అధికారంలోకి వ‌చ్చి నెల రోజులు కాకుండానే అప్పుడే మాజీ మంత్రి ఇలాకాలో పార్టీలో ముస‌లం రేగ‌డంతో పార్టీ నేత‌లు అసంతృప్తితో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: