తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొత్తరూపును సంతరించుకోనుంది. ఈ పథకాన్నిమరింత పారదర్శకంగా అమలు చేయడానికి గ్రామపంచాయతీలకే పూర్తి బాధ్యతలను కట్టబెట్టాలని నిర్ణయించింది. వాస్తవానికి చాలా రోజుల నుంచి ఉపాధి పనుల బాధ్యతను గ్రామపంచాయతీలకు అప్పగించాలని ప్రభుత్వం భావించినప్పటికీ వరుస ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

అయితే తాజాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధి హామీ పథకం మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వల్ల పనుల గుర్తింపు, వాటి అమలు తదితర విషయాలను ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు చూసుకుంటారు. ఫలితంగా పనులపై పర్యవేక్షణ పెరగనుంది. కూలీలందరికీ పనులు దొరుకుతాయి.

 

యేటా 100 రోజుల పని దినాలను కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరనుంది. దీంతో ఇప్పటి వరకు ఉపాధిహామీ పనుల్లో కీలకంగా వ్యవహరించిన మండల పరిషత్తులు ఇక నుంచి కేవలం పనుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం వరకే పరిమితం కానున్నాయి. నూతన విధానంలో క్షేత్ర సహాయకుడితో పాటు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచులు కీలకం కానున్నారు.

 

గ్రామాల్లో నిర్వహించే ఉపాధి ఉపాధి పనులను చేపట్టే బాధ్యతను తమకే అప్పగించాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని సర్పంచులు కోరుతున్నప్పటికీ ఇటీవలే కార్యరూపం దాల్చింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో కచ్చితంగా ఉపాధి పనులను ఆయా పంచాయతీల పర్యవేక్షణలో జరగాలని ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రసహాయకులు ప్రతి రోజు రెండు గంటలు పంచాయతీల్లో కూర్చుని సర్పంచి, పంచాయతీ కార్యదర్శులకు ఎప్పటికప్పుడు ఉపాధి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: